హిందీ టీవీ కమెడీ నటులు కపిల్ శర్మ, సునీల్ గ్రోవర్ మధ్య విమానంలో చోటు చేసుకున్న వివాదం బాలీవుడ్ లో పెను కలకలం రేపింది. దీనిపై వివిధ ఛానెళ్లలో కథనాలు వెల్లువెత్తడంతో కపిల్ శర్మ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ… ఈ వార్తలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?. ఏ ఉద్దేశంతో వీటిని సృష్టిస్తున్నారు? ఒకవేళ నేను విమానంలో సునీల్ ని కొట్టి ఉంటే అది ఎవరు మీకు చెప్పారు? అలా చెబితే నమ్మేస్తారా?
కొందరికి ఇలాంటి పుకార్లంటే చాలా ఇష్టం. మేము కలిసి తింటాం, కలిసి ప్రయాణిస్తాం, ముఖ్యంగా సునీల్ పాజీ అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. నిజమే ఆయనతో నేను గొడవపడ్డా. కానీ మేము మాత్రం మనుషులం కాదా? ఐదేళ్లలో తొలిసారి నేను ఆయనపై అరిచాను. ఇలాంటివి అప్పుడప్పుడూ జరుగుతుంటాయి. ఈ విషయాన్ని మేమిద్దరం కూర్చుని మాట్లాడుకుంటాం. అంతమాత్రాన తప్పుడు ప్రచారాలు చేయాలా?
సునీల్ నాకు అన్నయ్య లాంటి వాడు. నాకు మీడియాపై గౌరవం ఉంది. ఈ సమస్య కంటే చర్చించాల్సిన అంశాలు ఉన్న ఉన్నాయి. అయినప్పటికీ దీనిని వివాదం చేయడం దారుణమని చెబుతూ… ఇది మా కుటుంబ సమస్య, దీనిని మేమే పరిష్కరించుకుంటాం… అని కపిల్ శర్మ స్పష్టం చేశాడు. అయితే దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ… డబ్బు సంపాదించాక గర్వం తలకెక్కిందని పేర్కొంటున్నారు.
ముందు సునీల్ గ్రోవర్ కు క్షమాపణలు చెప్పాలని సూచించారు. సునీల్ గ్రోవర్ లేకపోతే ఏం జరుగుతుందో గతంలో ఓ సారి అనుభవంలోకి వచ్చిన విషయం గుర్తు చేసుకోవాలని వారు సూచించారు. సునీల్ గ్రోవర్ లేకపోతే కపిల్ శర్మ షోకి ఆదరణ ఉండదని, సుమోనా చక్రవర్తి లేకుండా నిన్ను చూడడం చిరాగ్గా ఉందని, సునీల్ గ్రోవర్ కూడా లేకపోతే నీ షోకు రేటింగ్స్ కూడా ఉండవని హెచ్చరిస్తున్నారు.



