సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం 2014 ఎన్నికల తరువాత పూర్తి స్థాయి కాపుసంఘం నాయకుడుగా మారిపోయారు. గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు పనిచేసి, 2014 నుండి ఏ పార్టీలోనూ చేరకుండా ఉన్నారు. తన సుధీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ముద్రగడ పద్మనాభం మూడుసార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి ఎంపీగా, రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.
2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్, వైకాపా ఆయనను తమ పార్టీలోకి తేవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ‘తుని విధ్వంసం’ కాస్త సైలెంట్ అయిన ఆయన సీఎంకు లేఖలతోనే సరిపెట్టుకుంటున్నారు. ఇటీవల మీడియా ముందుకు వచ్చిన ఆయన డిసెంబర్ లోపు కాపులకు రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందేనని లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని ఏపీ సర్కార్‌కు ముద్రగడ డెడ్‌లైన్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ ముద్రగడను కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత హర్షకుమార్ మరియు మాజీ ఎంపీ చింతామోహన్ కూడా ఇదే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు 2019లో అధికారంలోకి రావడమే ధ్యేయంగా పనిచేస్తున్న వైకాపా కూడా ఆయన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది.
ముద్రగడ తమ పార్టీలో చేరితే ఉభయ గోదావరి జిల్లాలలో కాపుల పై ప్రభావం చూపి 2019 ఎన్నికల్లో విశేషంగా లబ్ది చేకూరుతుందని పార్టీలు భావిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీని ముద్రగడ ఎంచుకుంటారా? లేకుంటే గతంలో పనిచేసిన కాంగ్రెస్ తీర్థమే పుచ్చుకుంటారా? వేచి చూడాలి.



