
కురుక్షేత్రంలో కర్ణుడు చావుకి సవాలక్ష కారణాలు ఉన్నట్టే ఎన్నికలలో వైసీపీ ఓటమికి ఆ స్థాయి తప్పిదాలు అనేకం. అయితే మొదటగా మా ఓటమికి ఈవీఎంలే కారణమంటూ మీడియా ముందుకొచ్చిన వైసీపీ పోనుపోను కుంటి సాకులు వదిలేసి అసలు కారణాలను వెలికి తీస్తుంది.
Also Read – కర్నూలు హైకోర్టు బెంచ్‌కి తొలి విగ్నం.. వాళ్ళేనా?
ఇందులో భాగంగా కొంతమంది వైసీపీ నాయకులు కేవలం మా ప్రభుత్వం సంక్షేమం మీద మాత్రమే ద్రుష్టి పెట్టింది కానీ అభివృద్ధిని గాలికొదిలేసిందని అందుకే వైసీపీకి ఈ ఘోర ఓటమి దక్కిందన్నారు. మరికొందరు మూడు రాజధానుల నిర్ణయంతోనే రాష్ట్రంలో మూడో స్థానానికి పడిపోయాం అంటూ తప్పు ఒప్పుకున్నారు.
ప్రజలిచ్చిన ఐదేళ్ల సమయాన్ని రాష్ట్రం కోసం కాకుండా ప్రతిపక్షం కోసం ఖర్చు చేయడంతో ఓడిపోవాల్సి వచ్చిందన్నారు మరికొందరు. అయితే పైన చెప్పిన కారణాలన్నీ కూడా వైసీపీ ఓటమికి సూచికలే కావడం ఇక్కడి విచిత్రం. అవే కాకుండా ఇంకా అనేక కారణాలు వైసీపీ ఓటమిని వెంటాడాయి.
Also Read – చంద్రబాబు దూరదృష్టి వలన ఏపీ సేఫ్!
ఇందులో మరికొన్ని కారణాలను శోధించి ప్రజల ముందుకు తీసుకువచ్చారు వైసీపీ గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. నాసిరకం మద్యం విక్రయించినందుకు, బాబు ను జైలు పంపినందుకు, ప్రతిపక్ష నేతలను బూతులు తిట్టనందుకు మా పార్టీకి ఈ దుస్థితి వచ్చిందని చెప్పుకొచ్చారు కాసు మహేష్ రెడ్డి.
అయితే గతయిదేళ్ళుగా బాబు ను బూతులు తిట్టింది టీడీపీ పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి వచ్చిన ఆ ఇద్దరు నేతలే అంటూ నేరం మొత్తం ఆ ఇద్దరి నేతల మీదే నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు గత ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వంలో నోటికి పని చెప్పని నేతలను, మంత్రులను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు.
Also Read – ఐసీయూ లో ఉన్న వైసీపీకి చిరు ఊతమిస్తే…టీడీపీ ఊపిరి తీసింది.!
గెలిచిన 151 ఎమ్మెల్యే లలో, మంత్రులుగా పని చేసిన నేతలందరూ దాదాపుగా ఈ బూతుల సంస్కృతిని పెంచి పోషించినవారే. కాసు మహేష్ రెడ్డి ఉద్దేశం ప్రకారం కొడాలి, వల్లభనేని మాత్రమే బూతులతో రెచ్చిపోయారని చెపుతున్నప్పటికీ అనిల్ కుమార్ యాదవ్, రోజా, గుడివాడ అమర్నాధ్, అంబటి రాంబాబు, జోగి రమేష్, దువ్వాడ శ్రీనివాస్, కొట్టు సత్యనారాయణ, నారాయణ స్వామి వంటి నేతల బూతులు కాసు రెడ్డి గారికి వినిపించలేదా.?
ద్వారం పూడి చంద్ర శేఖర్ రెడ్డి దిగజారుడు భాష కానీ, కాకాని గోవర్ధన్ రెడ్డి, పిన్నెల రామ కృష్ణ రెడ్డి, మధుసూధన రెడ్డి వంటి నేతలు వాడిన భాషనేమనాలి.? విజయ సాయి రెడ్డి గారి వెటకారం కానీ, జగన్ గారి వెక్కిరింపులు కానీ, సజ్జల గారి నోటి దూల కానీ, కాసు మహేష్ రెడ్డికి కనిపించలేదా.? లేక తమ సామజిక వర్గానికే చెందిన వ్యక్తుల బూతులు, కులాహంకారం కాసు మహేష్ రెడ్డి చెవిన పడలేదా.? లేక కళ్లుండీ చూడలేక, చెవులుండి వినలేని శారీరక వికలాంగుడి మాదిరి మిగిలిపోయారా.?
వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలకు, ఆ పార్టీ నేతలు పెట్టిన ప్రెస్ మీట్లకు, మంత్రులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశాలకు, ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి వైసీపీ ఎంపీ లు వేసే ట్వీట్లకు సెన్సార్ సర్టిఫికెట్ అవసరం అనే స్థాయికి రాజకీయాలను దిగజార్చిన ఘనత జగన్ సొంతం. ఇంత చేసి కూడా మంచి చేస్తే ఓడించేసారే అంటూ ప్రజల మీద నిందలు వేస్తున్న వైసీపీ నేతలు ఇకనైనా కళ్ళు తెరిస్తే వాస్తవాలు అర్థమవుతాయి.
నాలుగు దశబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నేతకు అదే పరిస్థితి, సినీ ఇండస్ట్రీలో స్టార్ హోదాలో ఉంటూ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న నాయకుడికి అదే దుస్థితి, ఇప్పుడిప్పుడే రాజకీయాల మీద ఆసక్తితో అడుగు ముందుకేస్తున్న మహిళా నేతలకు అదే ట్రీట్మెంట్ ఇచ్చిన వైసీపీకి ఈ స్థాయి ఓటమి 100 కి 1001 శాతం అర్హతే. వైసీపీ ఓటమికి ఇన్ని కారణాలు పెట్టుకుని ఆ ఇద్దరు నేతలు బూతులు తిట్టడం వల్లనే ఓడిపోయాం అంటూ కాసు చెపుతున్న కహానీలు నమ్మశక్యమా.?