కవిత మరో లేఖ…

Kavitha Another Letter To AP CM Chandrababu Naidu

ఈ మధ్యకాలంలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కవిత రాసిన లేఖ తెలంగాణ రాజకీయాలలో ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీలో ఎటువంటి రాజకీయ ప్రకంపనలు సృష్టించాయో అందరూ గమనించే ఉంటారు.

బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తప్ప తనకు ఎవరు నాయకులు లేరని, కేసీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ దెయ్యాలున్నాయని, బిఆర్ఎస్ ను బీజేపీ లో విలీనం చేసేందుకు కొందరు బిఆర్ఎస్ ముఖ్య నాయకులు బీజేపీ కోవర్టులుగా బిఆర్ఎస్ లో పని చేస్తున్నారంటూ ఇలా బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా చాల పెద్ద పెద్ద ఆరోపణలే చేసారు కవిత.

ADVERTISEMENT

ఇక ఇప్పుడు కవిత మరో లేఖాస్త్రాన్ని సంధించారు. అయితే ఈసారి గులాబీ కారు కు బదులు కూటమి ప్రభుత్వం పై కవిత విమర్శలు ఎక్కుపెట్టారు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ను ఉద్దేశిస్తూ రాసిన లేఖలో రాష్ట్ర పునర్విభజన అంశాలను లేవనెత్తారు.

రాష్ట్ర పునర్విభజన సమయంలో ఏపీలో కలిపిన ఎటపాక, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, గుండాల, పిచ్చుకులపాడు…ఈ 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చెయ్యాలంటూ కవిత ముఖ్యమంత్రి బాబుకి లేఖ రాసారు.

పోలవరం ముంపు పేరిట ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను చీకటి ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో విలీనం చేసుకున్నారని, ఫలితంగా లోయర్ సీలేరు పవర్ ప్లాంట్ ను లాగేసుకుని తెలంగాణ కరెంట్ కష్టాలకు కారణకులయ్యారంటూ తన లేఖ తో సీఎం బాబు పై విమర్శలు ఎక్కుపెట్టారు కవిత.

బిఆర్ఎస్ పార్టీలో తన ఉనికి కోసం పోరాడుతున్న కవిత, తెలంగాణ రాజకీయాలలో తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి పదేళ్ల క్రితం ముగిసిన పునర్విభజన విలీన అధ్యాయాలను నేడు తెరమీదకు తెచ్చి తానూ రాజకీయంగా లబ్ది పొందాలి చూస్తున్నారు. ఇటువంటి రాజకీయాలతో తెలంగాణలో మరో సారి ఆంధ్రా – తెలంగాణ అనే సెంటిమెంట్ కు తిరిగి ఆజ్యం పొయ్యాలన్నదే కవిత రాజకీయ వ్యూహమా.?

అందుకోసమే పోలవరం ముంపు మండలాల అంశాలను, బనకచర్ల నిర్మాణ పనులను కవిత ఎత్తి చూపుతున్నారు. మరి నాడు తండ్రికి రాసిన లేఖతో తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ అయిన కవిత నేడు బాబు కి రాసిన లేఖతో ఏపీ రాజకీయాలలో కూడా చర్చనీయాంశంగా మారారు.

ADVERTISEMENT
Latest Stories