బీసీ రిజర్వేషన్స్: బీసీల కోసం కాదు!

Kavitha BC Reservation Fight: A Political Ploy?

కేసీఆర్‌ పదేళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించారు. ఏనాడూ బీసీ రిజర్వేషన్స్, మహిళా రిజర్వేషన్స్ గురించి కనీసం ఆలోచించలేదు.

ఆయన కుమార్తె కల్వకుంట్ల కవితకి ఎంపీ పదవి కట్టబెట్టడంతో ఆమెకి కూడా వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం కలుగలేదు.

ADVERTISEMENT

కేసీఆర్‌ రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కల్వకుంట్ల కవితకు తప్పకుండా మహిళల కోటాలో మంత్రి పదవి లభిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఇవ్వలేదు. మళ్ళీ నిజామాబాద్ నుంచే ఎంపీగా పోటీ చేస్తే ఎన్నికలలో ఓడిపోయారు.

బీఆర్ఎస్‌ పార్టీలో దెయ్యాలే కుట్ర చేసి తనను ఓడించాయని, ఈ విషయం తండ్రి కేసీఆర్‌కి చెప్పినా పట్టించుకోలేదని కల్వకుంట్ల కవిత ఇటీవలే బయటపెట్టి బాధపడ్డారు. మంత్రి, ఎంపీ పదవులు దక్కకపోగా ధిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆర్నెల్లు తీహార్ జైల్లో ఉండాల్సి వచ్చింది.

తనని అరెస్ట్‌ చేసినప్పుడు పార్టీ అండగా ఉంటుందని, తన అరెస్టుని గట్టిగా ఖండిస్తారనుకున్నానని కానీ పార్టీ నాకు అండగా నిలబడలేదని కల్వకుంట్ల కవిత కుండబద్దలు కొట్టారు.

ఇలా అనేక కుండలుబద్దలు కొట్టడంతో కేసీఆర్‌ ఆమెను దూరం పెట్టారు. కనుక ఆమె అన్న కేటీఆర్‌తో సహా బీఆర్ఎస్‌ నేతలు కూడా ఆమెను దూరమయ్యారు.

కనుక ఆమెకు తన రాజకీయ మనుగడని కాపాడుకోవలసిన అవసరం ఏర్పడింది. దాని కోసమే ఆమె బీసీ రిజర్వేషన్స్ పెంపు అంశం భుజానికెత్తుకొని పోరాటాలు మొదలుపెట్టారనిపిస్తుంది. లేకుంటే తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే దాని గురించి మాట్లాడి ఉండేవారు కదా?

కానీ ఇప్పుడు కొత్తగా ఈ పోరాటం మొదలుపెట్టలేదని ఏడాదిన్నర క్రితమే మొదలుపెట్టానని, కనుక బీసీ రిజర్వేషన్స్ అంశంపై పూర్తి పేటెంట్ హక్కులు తనకే ఉన్నాయన్నట్లు కవిత మాట్లాడారు.

ఇదివరకు మద్యం కుంభకోణం కేసులో ఈడీ నోటీసులు ఇస్తున్నప్పుడు కల్వకుంట్ల కవితకి చట్ట సభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అవసరమనే విషయం గుర్తుకు వచ్చి ధిల్లీలో ధర్నా చేశారు. ఆ తర్వాత దాని సంగతి మరిచిపోయారు.

అంతకు ముందు కేసీఆర్‌కి కూడా ఇలాగే ముస్లింలకు విద్య ఉద్యోగాలలో 12 శాతం రిజర్వేషన్స్ అవసరమనిపించి, శాసనసభలో తీర్మానం చేసి డిల్లీకి పోస్టు బాక్సులో పడేసి చేతులు దులుపుకున్నారు.

తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ అవసరమనిపించి అదే చేశారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్స్ ఖరారు చేయాల్సిరావడంతో ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ చేస్తామని చెప్పారు.

“ఇది తన తొలి విజయమని, రాజకీయాలలో ఓ మెట్టు పైకి ఎక్కినట్లే” అని కల్వకుంట్ల కవిత స్వయంగా చెప్పుకున్నారు. అంటే ఈ పోరాటాలు దేనికో అర్ధమవుతుంది.

స్థానిక సంస్థల ఎన్నికలలో గట్టెక్కడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్స్ అస్త్రం వాడుకోవాలనుకుంటే, ఆ అస్త్రం తనదని కల్వకుంట్ల కవిత చెప్పుకుంటున్నారు. అయితే బీసీ రిజర్వేషన్స్ అంశంపై ఆర్డినెన్స్ జారీ చేస్తామంటూ రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్‌ పార్టీ నేతలు వాదిస్తున్నారు.

ఈవిదంగా బీసీలు లేదా మరో వర్గానికి రిజర్వేషన్స్ పేరుతో రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తూనే తాము చాలా చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పుకుంటున్నారు.

కల్వకుంట్ల కవిత కూడా రాజకీయ నాయకురాలే కదా?అందుకే “సమాచార హక్కు చట్టం కమిషన్‌లో బీసీలు, ఎస్టీలకు చోటు లేదా? ఇప్పటికే నియమించిన చీఫ్ కమిషనర్, నలుగురు కమిషనర్లలో ఒక్కరు కూడా, ఎస్టీ, బీసీలు లేరు. మరో ముగ్గురు కమిషనర్ల నియామకాలకు రూపొందించిన ప్రతిపాదనల్లోనూ బీసీలు, ఎస్టీలకు ఛాన్స్ ఇవ్వలేదని తెలుస్తోంది. జనాభా దామాషా ప్రకారం పెండింగ్‌లో ఉన్న మూడు కమిషనర్ పోస్టులను బీసీలు, ఎస్టీలతో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాను. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ది ఉన్నదో ఈ చర్యలే రూడీ చేస్తున్నాయి,” అంటూ ఓ ట్వీట్ వేశారు.

కనుక బీసీ రిజర్వేషన్స్ అనగానే అవి మన కోసమే అని బీసీలు భ్రమ పడకూడదు. అవి రాజకీయ నాయకుల కోసం మాత్రమే.

ADVERTISEMENT
Latest Stories