కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ‘మోడీ గీడీ జాంతా నై… మోడీని దించేస్తా ఆ కుర్చీలో నేను కూర్చుంటా.. దేశ రాజకీయాలలో ‘గుణాత్మకమైన మార్పు’ తెస్తాననేవారు.
దేశ ప్రజలందరూ తన కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారని పార్టీ క్యాడర్ చేత చెప్పించుకునేవారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేశా ఇక దేశాన్ని ఉద్దరిస్తా.. నన్ను ఢిల్లీ వెళ్ళమంటారా వద్దా? అని ప్రజల చేత వెళ్ళమని చెప్పించుకునేవారు. ఎన్నికలు రావడమే ఆలస్యం.. తాను ప్రధాని అయిపోవడం ఖాయమే అన్నట్లు కేసీఆర్ మాట్లాడేవారు.
అదంతా ఓ పగటి కలగా మిగిలిపోయింది! పోతే పోయింది కానీ కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక కూడా ఊడినట్లు తిరుగులేదనుకున్న తెలంగాణలోనే ఓడిపోయారు. కాలం ఆ బాధని మెల్లగా మరిపిస్తుంటే, ఇప్పుడు కూతురు కవిత హటాత్తుగా ఆపరేషన్ సింధూర్ చేపట్టి అదే బీజేపిలో బిఆర్ఎస్ పార్టీని విలీనం చేసేయాలని తన తండ్రి కేసీఆర్ తహతహలాడుతున్నారని చాటింపు వేసేశారు. బిఆర్ఎస్ పార్టీలో వారికీ ఇది కక్కలేని మింగలేని పరిస్థితి.
ఆమెను ఏమైనా అందామంటే కేసీఆర్ కూతురు.. ఇంకా పార్టీలోనే ఉన్నారు. అలాగని ఊరుకుంటే ఆమె పదేపదే విలీనం మాటలు మాట్లాడుతుంటే పార్టీ విశ్వసనీయత దెబ్బ తింటోంది.
కానీ ‘దేవుడు’ ఇంకా మౌనంగానే ఉన్నారు. కనుక ఆయన చుట్టూ ఉన్న ‘దెయ్యాలు’ కూడా మౌనంగా ఉండిపోక తప్పడం లేదు.
ఈరోజు ఆమె మంచిర్యాల పట్టణంలో పర్యటించినప్పుడు మీడియాతో మాట్లాడుతూ, “బిఆర్ఎస్ పార్టీ బీజేపిలో విలీనం కాకుండా కాపాడుకోవాలనే నా తాపత్రయం అంతా. బీజేపిలో విలీనం అయితే లిక్కర్ కేసుకి భయపడి లొంగిపోయినట్లే కదా?
నేను ఆ నేరం చేసినట్లు పార్టీ అంగీకరించినట్లే కదా?నేను ఏ నేరం చేయలేదని చెపుతూనే ఉన్నాను. అందుకే న్యాయస్థానం కూడా నాకు బెయిల్ ఇచ్చింది కదా? అటువంటప్పుడు బీజేపిని చూసి భయపడటం దేనికి?
అయినా బీజేపిలో విలీనం అయిన పార్టీలన్నీ తమ ఉనికి కోల్పోతాయి. కనుక బిఆర్ఎస్ పార్టీ ఆ ఆలోచన విరమించుకోవాలని కోరుతున్నాను.
నాకు కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదు. బిఆర్ఎస్ పార్టీ నుంచి నన్ను బహిష్కరిస్తారని అనుకోవడం లేదు. నా భవిష్యత్ కార్యాచరణ కేసీఆర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.
కేసీఆర్‌కి ఇటువంటి ఆలోచన ఉందనే విషయం ఆయన కూతురు కల్వకుంట్ల కవిత స్వయంగా మైకులో చెపుతుంటే, ఇంక ఆ పార్టీని ఎవరు నమ్ముతారు?కేటీఆర్ లేదా హరీష్ రావులు ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వం, బీజేపిలపై చేసే విమర్శలను ఎవరు నమ్ముతారు?
తన తాపత్రయం బిఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడానికే అంటూనే ఈ విలీనం మాటలతో కల్వకుంట్ల కవిత బిఆర్ఎస్ పార్టీని కోలుకోనివిదంగా దెబ్బ తీస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.




