ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీస్ పంపింది. శుక్రవారం ఈ కేసు విచారణకు ఢిల్లీకి రావాలని ఆదేశించింది. గత 4-5 నెలలుగా ఆమె జోలికి వెళ్లని ఈడీ నేడో రేపో తెలంగాణ శాసనసభ ఎన్నికల గంట మ్రోగబోతున్న సమయంలో నోటీస్ పంపడం యాదృచ్ఛికం కాదనే అర్దమవుతోంది.
ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు మరియు అరబిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డి, వైసీపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ రెడ్డి, అరుణ్ రామచంద్ర పిళ్లై తదితరులందరూ అప్రూవర్లుగా మారి బయటకువచ్చేశారు. కనుక కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేసేందుకు ఈడీ వద్ద బలమైన ఆధారాలు చాలానే ఉండి ఉండవచ్చు.
కానీ ఎన్నికలకు ముందు కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేస్తే, కేసీఆర్ దానిని బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మార్చుకొని మళ్ళీ అవలీలగా విజయం సాధించగలరని మోడీ, అమిత్ షాలకు కూడా తెలుసు. కనుక ఈడీ విచారణ పేరుతో ఆమెపై ఒత్తిడి చేస్తూ కేసీఆర్‌ని కట్టడి చేయడమే వారి లక్ష్యం కావచ్చు.
కనుక ఈడీ ఆమెను అరెస్ట్ చేయకపోవచ్చు. ఒకవేళ చేసినా కేసీఆర్ కుటుంబం మీద దాంతో ‘అవినీతి ముద్ర’ వేసేందుకు మాత్రం పరిమితం చేస్తూ మళ్ళీ విడిచిపెట్టవచ్చు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని మార్చినప్పటి నుంచి తెలంగాణలో బీజేపీ వెనకబడి, దాని స్థానంలోకి కాంగ్రెస్ దూసుకువచ్చింది. కానీ కవితకు ఈడీ నోటీసుతో మళ్ళీ బిఆర్ఎస్, బీజేపీల మద్య రాజకీయ యుద్ధాలు మొదలైతే కాంగ్రెస్‌ను వెనక్కు నెట్టి మళ్ళీ బీజేపీ రెండో స్థానంలోకి రాగలుగుతుంది.
కేసీఆర్ మహారాష్ట్రలో తన పార్టీని వ్యాపించి ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని, ముఖ్యంగా ఆ రాష్ట్రంలో 48 ఎంపీ సీట్లలో ఈసారి వీలైనన్ని ఎక్కువ గెలుచుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దీని వలన మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. కేసీఆర్ వలన మహారాష్ట్రలో బీజేపీ నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. ఒకవేళ మహారాష్ట్రలో కేసీఆర్ కేవలం ఎంపీ సీట్లను కొల్లగొట్టినా లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సీట్లు తగ్గవచ్చు. ఇది బీజేపీకి చాలా ప్రమాదకరం.
కనుక ఈ కేసుతో కేసీఆర్‌ని కట్టడి చేసి మహారాష్ట్రలో తిరగకుండా అడ్డుకోవాలని కూడా బీజేపీ అధిష్టానం ప్రయత్నించవచ్చు. ఈ ఏడాది మే నెలలో జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని బరిలో దింపడానికి కేసీఆర్ సిద్దపడినప్పుడు కూడా ఇలాగే ఈడీ ద్వారా ఆయన కూతురుపై ఒత్తిడి పెంచి అడ్డుకొంది. కనుక ఇపుడు అదే ప్లాన్ అమలుచేస్తున్నట్లు భావించవచ్చు.