కవిత ఇంటర్వ్యూ: మళ్ళీ ఏం బాంబు పేలుస్తారో?

kalvakuntla-kavitha-murthy-tv5

బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీపై, తండ్రిపై తిరుగుబాటు చేసి సంచలనం సృష్టించారు.

ADVERTISEMENT

కానీ కేసీఆర్‌ ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా, కనీసం స్పందించకుండా ఆమెకు చాలా కఠిన శిక్షే వేశారని చెప్పొచ్చు. ఈ నెల రోజులలోనే తెలంగాణ రాజకీయాలలో ఆమెను ఒంటరిగా నిలబెట్టి ఆమె స్థానం, పరిస్థితి ఏమిటో ఆమెకు తెలిసి వచ్చేలా చేశారు.

కనుక ఆమె కూడా తండ్రిని ప్రసన్నం చేసుకుని మళ్ళీ బిఆర్ఎస్ గూటికి చేరుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ కేసీఆర్‌ ఆమెను ఇంకా కరుణించలేదు. కనుక ఆమె తండ్రి పిలుపు కోసం ఎదురు చూపులు చూస్తూనే ఉన్నారు.

ఆమె రాజకీయ సంయమనం పాటిస్తూ ఇలాగే మరికొంత కాలం ఎదురుచూసి ఉండి ఉంటే ఆ తండ్రి మనసు కరిగి ఉండేదేమో?కానీ ఆమె తొందరపడి ఈరోజు ఓ న్యూస్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్‌ టీవీ5లో ఈరోజు సాయంత్రం 7 గంటలకు ‘సిఎం టార్గెట్’ పేరుతో కల్వకుంట్ల కవిత పోడ్ కాస్ట్ ప్రసారం కాబోతోంది. ఆ తర్వాత రాత్రి 9 గంటలకు టీవీ5 న్యూస్ ఛానల్లో ఆమె ఇంటర్వ్యూ ప్రసారం కాబోతోంది. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి ఆమెను ఇంటర్వ్యూ చేశారు.

ఈ విషయం తెలియజేస్తూ ఎక్స్‌ సోషల్ మీడియాలో “ట్యాపింగ్ జరిగిందా?దయ్యం ఎవరు? జాగృతి ప్లానెంటీ?అలాగే ఎన్నో రహస్యాలు!” అని ఇంటర్వ్యూ దేని గురించో ఓ క్లూ ఇచ్చారు.

కనుక టీవీ 5 ఇంటర్వ్యూలో ఆమె తండ్రి కేసీఆర్‌, అన్న కేటీఆర్‌, బావ హరీష్ రావుల గురించి ఏం చెప్పారో? బిఆర్ఎస్ పార్టీ బీజేపిలో విలీనం గురించి ఏం చెప్పారనేది అందరిలో చాలా ఆసక్తి కలిగిస్తుంది.

ఇన్ని రోజులు గడిచినా తండ్రి నుంచి పిలుపు రాకపోవడంతో ఆమె సహనం కోల్పోయి నోరు విప్పేందుకు సిద్దపడి ఉండవచ్చు లేదా తండ్రిని ప్రసన్నం చేసుకునేందుకు కావచ్చు.

ఏది ఏమైనప్పటికీ, కల్వకుంట్ల కవిత ఇప్పుడే ఈ అంశంపై టీవీ 5తో మాట్లాడటం తొందరపాటే అనిపిస్తుంది. మరి ఈరోజు ఇంటర్వ్యూలో కల్వకుంట్ల కవిత ఏం మాట్లాడారో.. మళ్ళీ కొత్తగా ఏం బాంబులు పేలుస్తారో.. మరికొన్ని గంటలలోనే తెలుస్తుంది.

ADVERTISEMENT
Latest Stories