కల్వకుంట్ల కవిత మరోమారు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. ఈసారి కేంద్ర ఎన్నికల కమీషన్‌పై కేసు వేశారు. తన కొత్త పార్టీ ఏర్పాటు విషయంలో వీలైనంత త్వరగా కేంద్ర ఎన్నికల కమీషన్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించవలసిందిగా ఆమె అభ్యర్ధించారు.
ఈ కేసుపై ఫిభ్రవరి 27న విచారణ జరిపినప్పుడు, ఆమె సమర్పించిన దరఖాస్తులోనే అనేక తప్పులున్నాయనే విషయం ఫిభ్రవరి 23నే ఆమెకు లిఖితపూర్వకంగా తెలియజేశామని ఈసీ తరపు న్యాయవాది ఢిల్లీ హైకోర్టుకి తెలిపారు. ఈరోజు మళ్ళీ ఈ కేసుపై విచారణ చేపట్టనుంది.
పార్టీ రిజిస్ట్రేషన్ కోసం కూడా ఆమె హైకోర్టుని ఆశ్రయించడం కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ కాస్త లోతుగా ఆలోచిస్తే కోలీవుడ్ హీరో విజయ్ రాజకీయ ప్రవేశానికి కేంద్రం సెన్సార్ బోర్డు, సీబీఐ చేత ఏవిధంగా బ్రేకులు వేయిస్తోందో, అదేవిధంగా కల్వకుంట్ల కవితకి బ్రేకులు వేస్తోందా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కానీ ఇల్లలకాగానే పండగ కాదన్నట్లు ఆమె కొత్త పార్టీ ఏర్పాటు చేసుకున్నా ముందుంది ముసళ్ళ పండగ అని అందరికీ తెలుసు. రెండు జాతీయ పార్టీలు, తెలంగాణ జాతిపిత అధ్వర్యంలో నడుస్తున్న బీఆర్ఎస్ పార్టీలను ఆమె ఒంటరిగా ఎదుర్కొని నిలబడటం చాలా కష్టం. కనుక కల్వకుంట్ల కవిత విషయంలో కూడా కేంద్రం కలుగజేసుకోకుండా ఉండటమే మేలు!
తాజా సమాచారం ప్రకారం కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరు ‘తెలంగాణ ప్రజా జాగృతి’ అని తెలుస్తోంది.




