జాగృతి అధ్యక్షురాలు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాజకీయాన్ని గమనిస్తే, ప్రభుత్వం పై పోరాటాలు, దీక్షలు అంటూ నానా హడావుడి చేస్తున్నారు. నిన్న 42 % బీసీల రిజర్వేషన్ కోసం 72 గంటలు నిరాహార దీక్ష ప్రారంభించిన కవిత దీక్షలు గతంలో ప్రత్యేక హోదా కోసం జగన్ చేపట్టిన దీక్షలను జ్ఞప్తికి తెస్తున్నాయి.
దీక్షలు అంటే అదొక రాజకీయ పార్టీ ప్రజల పక్షాన చేసే పోరాటం మాదిరి కాకుండా ప్రజలలో తన పార్టీ పట్ల గుర్తింపు, తన పట్ల గౌరవం కలిగించే ఒక ప్రచార కార్యక్రమం మాదిరి కొనసాగుతుంది.
నాడు జగన్, వైసీపీ గుర్తింపు కోసం తన ముఖ్యమంత్రి పదవి కోసం వైఎస్ఆర్ బొమ్మతో దీక్షలు చేపడితే నేడు కవిత జ్యోతి రావు పూలే, అంబేద్కర్, ప్రొపెసర్ జయ శంకర్ విగ్రహాలతో కథ మొదలు పెట్టారు.
ఇక నాడు జగన్ కూడా కేంద్ర ప్రభుత్వం తో తేల్చుకోవాల్సిన ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తూ ఢిల్లీ సమస్య పరిష్కారం కొరకు గల్లీలో దీక్షలు చేపట్టారు. ఇప్పుడు కవిత చేస్తున్న రిజర్వేషన్ దీక్షలు సైతం ఢిల్లీ కేంద్రంగా జరిగితే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
కానీ కవిత కూడా జగన్ తరహాలో కేంద్రంతో కొట్లాడాల్సిన సమయంలో రాష్ట్రంతో పోరాటం చేయడానికి దీక్షల పేరుతో ముందుకొచ్చారు. నాడు జగన్ కూడా 48 గంటల దీక్ష, 72 గంటల పోరాటం అంటూ నానా హంగామా చేసి చివరికి 24 గంటలకి ముంచేవారు.
కవిత కూడా సేమ్ టూ సేమ్ అదే మాదిరి 72 గంటల దీక్ష అంటూ ప్రకటించి చివరికి ఆ దీక్షను కేవలం 5 గంటలకే ముగించారు. ఇలా కవిత రాజకీయ దీక్షలు గత వైసీపీ దీక్షలను గుర్తుకు తెచ్చి జగన్ రాజకీయాలను మరోమారు చర్చించుకునేలా చేసాయి.
ఇక జాగృతి పేరు మీద కవిత చేస్తున్న ఈ రాజకీయం, దాని నుంచి కవిత ఆశిస్తున్న రాజకీయ లబ్ది విషయానికొస్తే, ఈ విషయంలో కవిత మళ్ళీ వైఎస్ కుటుంబాన్నే ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది.
గతంలో ఆడ పిల్లను కాదు ఈడ పిల్లను అంటూ వైస్ షర్మిల ఏపీ ని వదిలి తెలంగాణలో టి.వైఎస్ఆర్ పార్టీ పేరుతో రాజకీయం మొదలుపెట్టారు. నాడు షర్మిల కూడా అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం పై పోరాటం అంటూ నిరుద్యోగుల కోసం ప్రతి మంగళవారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్షలు చేపట్టారు.
అలాగే తెలంగాణ అంతటా పాదయాత్ర పేరుతో రాజకీయం నడిపారు. అయినా తెలంగాణలో షర్మిలకు దక్కిన గుర్తింపు, ఆమె పార్టీ సాధించిన గౌరవం ఏ స్థాయిలో ఉందో కవిత కూడా గమనించినవారే.
నాటి ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ షర్మిల పోరాటాలను, ఆమె దీక్షలను పట్టించుకున్న పాపాన పోలేదు. చివరికి షర్మిల ఎన్నికల బరిలో నుంచి తప్పుకుని కాంగ్రెస్ కు మద్దతు పలికి అదే కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేసారు.
అయితే, నా త్యాగాల ఫలితంగానే బిఆర్ఎస్ ఓడింది, కాంగ్రెస్ నెగ్గింది అని చెప్పుకునే అవకాశం తప్ప షర్మిలకు, టి. వైఎస్ఆర్ పార్టీకి తెలంగాణ రాజకీయాలలో దక్కిన ఫలితం శూన్యమనే చెప్పాలి.
ఇప్పుడు కవిత చేస్తున్న రాజకీయ పోరాటాల ఫలితం కూడా ప్రస్తుతానికి అటు ప్రభుత్వాన్ని కానీ ఇటు ప్రతిపక్షాన్ని కానీ నిర్దేశించే స్థాయిలో లేవనే చెప్పాలి. కానీ కవిత మాత్రం తన పోరాటాల ఫలితమే, తన జాగృతి ఉద్యమాల సాధనే బీసీల రిజర్వేషన్ అంటూ జబ్బలు చరుచుకుంటుంది.
ఇదంతా నిశితంగా గమనిస్తే, కవిత రాజకీయ దీక్షలు జగన్, వైసీపీ దీక్షలను తలపిస్తే, జాగృతి కార్యక్రమాలు షర్మిల టి. వైఎస్ఆర్ ఫలితాలను సూచిస్తున్నాయి. మరి రానున్న కాలంలో ఈ దీక్షలు ఢిల్లీ దాక వెళ్తాయో గల్లీలోనే ఆగిపోతాయో.? వాటి ఫలితాలు జాగృతి కి తోడవుతాయో.? బిఆర్ఎస్ లో విలీనం అవుతాయో.? చూడాలి.






