ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీతో తన రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన కేసీఆర్ బాబు ప్రభుత్వంలో ఒక్క మంత్రి పదవి ఆశించి, అది దక్కక టీడీపీ కి దూరమై తెరాస తో సొంత కుంపటి పెట్టుకున్నారనే ప్రచారం ఏపీ రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తుంది.
నాడు బాబు ఆ ఒక్క మంత్రి పదవి కేసీఆర్ కి ఇచ్చివుంటే ఇప్పుడు ఆంధ్రా – తెలంగాణ అంటూ ఉమ్మడి ఏపీ రెండుగా విడిపోయి ఉండేది కాదని అనేకమంది రాజకీయ విశ్లేషకులు పలు సందర్భాలలో తమ అభిప్రాయాని కుండబద్దలు కొట్టినట్టు చెపుతారు.
అయితే సరిగ్గా ఇప్పుడు బిఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన కవిత రాజకీయం చూస్తుంటే నాటి కేసీఆర్ రాజకీయం యాదికొస్తుంది అనేలా ఉంది. బిఆర్ఎస్ పార్టీలో అన్న కేటీఆర్ కి దక్కిన ప్రాధాన్యతే కవిత కు కూడా దక్కి ఉంటే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కేసీఆర్ రాజకీయ వారసుడిగా కేటీఆర్ కి ఇచ్చిన స్థానమే కవితకు కూడా పంచినట్టయితే ఇప్పుడు కవిత బిఆర్ఎస్ నుంచి ఇలా బయటకు వచ్చేవారేనా.? కొత్త పార్టీ పెట్టేవారేనా.?
ఇలా తండ్రి కేసీఆర్ ని కాదనుకుని, తెలంగాణ ప్రజా జాగృతి అంటూ అన్న కేటీఆర్ కి ఎదురెళ్ళే వారేనా.? హరీష్ రావు ని ఎదిరించే వారేనా.? తండ్రి కేసీఆర్ మాదిరే కవిత కూడా తన పార్టీ నుంచి తానూ ఆశించిన స్థానం, స్థాయి దక్కకే ఇలా ఆత్మగౌరవం పేరుతో కేసీఆర్ కి లేఖలు రాసి, హరీష్ – సంతోష్ ల పై అవినీతి ఆరోపణలు చేసి సస్పెన్షన్ వేటుతో బయటకొచ్చారా.?
మరి తెరాస ఏర్పాటుతో కేసీఆర్ అనుకున్న ప్రత్యేక తెలంగాణ సాధించినట్టే కవిత కూడా టీపీజే తో అనుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకోనున్నారా.? నేడు కేసీఆర్ విషయంలో బాబు చేసిన పొరపాటే నేడు కవిత విషయంలో కేసీఆర్ చేస్తున్నారా.?
ఒకరకంగా చెప్పాలంటే నాడు బాబు చేసిన ఆ ఒక్క పొరపాటే తెలంగాణలో టీడీపీ పార్టీ ఆయువు తీసిందని చెప్పాలి. మరి ఇప్పుడు కేసీఆర్ చేస్తున్న ఈ పొరపాటు బిఆర్ఎస్ ను ఏ పరిస్థితిలోకి నెట్టనుందో.? అయితే తన రాజకీయ భవిష్యత్ కోసం తన పార్టీ గెలుపు కోసం ఎవరితోనైనా రాజకీయ యుద్ధం చేయడానికి నేను సిద్ధం అంటూ కవిత ఇప్పటికే తండ్రి కేసీఆర్ కి అన్న కేటీఆర్ కి పరోక్ష సంకేతాలు పంపుతున్నారు.






