రాజకీయాలు ఎంతటి బలమైన రక్త సంబంధాలనైనా చాల సులభంగా ముక్కలు చేయగలవు అని కల్వకుంట్ల కుటుంబ కలహాలతో మరోసారి రుజువుచేశాయి. నాడు ప్రత్యేక తెలంగాణ అనే నినాదంతో తెలుగు రాజకీయాలలో చరిత్ర సృష్టించిన కల్వకుంట్ల బ్రాండ్ నేడు పార్టీలో ప్రత్యేక గుర్తింపుని కాంక్షిస్తూ మీడియాలో రచ్చకెక్కుతున్నాయి.
ఇన్నేళ్ళుగా బిఆర్ఎస్ ఎంపీ గా, ఎమ్మెల్సీ గా కొనసాగిన కవిత రాజకీయ ప్రయాణం ఇప్పుడు పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కావాలని కోరుకుంటుంది. కేసీఆర్ తరువాత పార్టీ అధినేతగా కేటీఆర్ ను ఉహించలేకపోతున్న కవిత పార్టీ నాయకత్వ మార్పును బహిరంగంగానే వ్యతిరేకిస్తుంది.
కేటీఆర్ పై పరోక్షంగానే విమర్శలు ఎక్కుపెడుతుంది. రోజురోజుకి అన్నతో ఉన్న రాజకీయ విభేదాలు బిఆర్ఎస్ లో కవితకు ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాయి. అటు కేటీఆర్ సైతం చెల్లెలి ఇంటి పోరు తాళలేకున్నారు. దీనితో ఎలా అయినా కేసీఆర్ ను ఒప్పించి పార్టీ నుండి కవితను సస్పెండ్ చేయించాలని కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు.
అయితే అటు కొడుకు ఇటు కూతురు మధ్య మొదలైన ఈ రాజకీయ ఆధిపత్య పోరు బిఆర్ఎస్ ను ఎక్కడ మసగబారేలా చేస్తుందో అన్న ఆందోళన కేసీఆర్ ను వెంటాడుతుంది. అయితే ఇటీవల తన చిన్న కుమారుడి ఉన్నత చదువుల కోసం అమెరికా పర్యటనకు వెళ్లిన కవితకు బిఆర్ఎస్ నుంచి ఊహించని షాక్ తగిలింది.
సింగరేణి కాలరీస్ ట్రేడ్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవితను ఆ స్థానం నుంచి తొలగించి, ఆ స్థానంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను నియమించింది బిఆర్ఎస్. అయితే ఈ నియమాకం వెనుక కేటీఆర్ ఉన్నారనే వార్తలను అటు కవిత కూడా పరోక్షంగా బలపరిచారు.
ఈ పరిణామాలన్నింటితో మనసు విరిగి పోయిన కవిత అమెరికా పర్యటన ముగించుకుని నుంచి రాగానే బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలనీ భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఒకవేళ కవిత ఈ నిర్ణయం వైపు అడుగులు వేసినట్లయితే అది కేటీఆర్ కు అత్యంత లాభదాయకం అవుతుంది.
తానూ కేసీఆర్ పై ఒత్తిడి తెచ్చి చేయించాలి అనుకున్న పనిని కవిత తన స్వహస్తాలతో తానే చేసుకుంటుంటే అది బిఆర్ఎస్ కు ముఖ్యంగా కేటీఆర్ కు కలిసొచ్చే అంశం అవుతుంది. అటు కవిత కూడా ఇప్పటికిప్పుడు కొత్త పార్టీని స్థాపించి తెలంగాణ రాజకీయాలలో సాధించేది ఏమి ఉండకపోవచ్చు.
అందుకు ఉదాహరణగా కవిత టి. వైసీపీ అధ్యక్షురాలు వైస్ షర్మిల ను చూడవచ్చు. అలాగే ఇటు కాంగ్రెస్ గూటికి కానీ అటు బీజేపీ నీడలోకి కాని కవిత రాజకీయ ప్రయాణం సాగించలేరు. అందుచేత కవిత బిఆర్ఎస్ రాజీనామా నిర్ణయాన్ని భావోద్వేగాలతో కాకుండా రాజకీయ పరిపక్వతతో ఆలోచించాలి.
జాగృతి అంటూ కవిత వేగంగా అడుగులు వేయాలని భావించినా అది కేసీఆర్ ఛరిష్మాను దాటి ముందుకెళ్లగలవా.? అలాగే ఇటు పదేళ్లు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా ప్రజలలో కేటీఆర్ సాధించిన ఇమేజ్ కవిత రాజకీయాన్ని నిలబడనిస్తాయా.?
బిఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో సింహ భాగం కవిత ఢిల్లీ రాజకీయాలలోనే హల్ చల్ చేసారు. రాష్ట్ర రాజకీయాలకు సెకండ్ ప్రయారిటీ అన్నట్టుగా సాగిన కవిత రాజకీయ ప్రయాణం ఇప్పుడు ఒక్కసారిగా రాష్ట్ర ప్రయోజనాలు, పార్టీ పదవులు అంటే వాటిని అంగీకరించే పరిస్థితులు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలో ఉన్నాయా.?






