
బిఆర్ఎస్ పార్టీకి బలం, బలహీనత కూడా కేసీఆరే. కనుక ఆయన బలంగా ఉన్నంత కాలం బిఆర్ఎస్ పార్టీ ఎదురేలేదనట్లు సాగింది. ఆయన బలహీనపడగానే ఆ పార్టీ మునిగిపోయే పరిస్థితి నెలకొంది.
అధికారంలో ఉన్నప్పుడు దూకుడుగా వ్యవహరించడం గొప్ప విషయమేమీ కాదు కానీ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కూడా నిబ్బరంగా వ్యవహరించడమే చాలా గొప్ప విషయం.
Also Read – యుద్ధాలు చేయకుండా అమెరికా ఉండలేదేమో
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు పీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి, ఏపీలో ఓటమి తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా నిబ్బరంగా వ్యవహరించడమే ఇందుకు చక్కటి ఉదాహరణలు.
కానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు తన కాలి గోటికి కూడా సరిపోరన్నట్లు చాలా అహంభావంతో విర్రవీగి, ఎన్నికలలో ఓడిపోయినప్పటి నుంచి ఫామ్‌హౌస్‌లో నుంచి బయటకు రావడం మానేశారు.
Also Read – యుద్ధాలతో కనపడే విధ్వంసం కొంత.. కనపడనిది అనంతం!
కేసీఆర్ అస్త్ర సన్యాసం చేయడంతో ఆ పార్టీలో కేటీఆర్, హరీష్ రావుల మద్య ఆధిపత్యపోరు మొదలైంది. ఇది చాలా సహజం.
వారిద్దరూ పార్టీ పగ్గాల కోసం పోరాడుకుంటూ నన్ను సైడ్ చేసేశారనే ఆవేదన కల్వకుంట్ల కవితకి కలగడం సహజం. కనుక ఆమె కూడా చురుకుగా రాజకీయాలలో పాల్గొంటూ, బిఆర్ఎస్ పార్టీలో తన ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
Also Read – వైసీపీ ‘రక్త దాహం’ తీరలేదా.?
ఈ నేపధ్యంలో ఏప్రిల్ 27న బిఆర్ఎస్ పార్టీ 25వ వార్షికోత్సవ సభ హనుమకొండలో జరిగింది. ఆ సభలో కేసీఆర్ పాల్గొనబోతున్నారంటూ అందరూ కలిసి బాగానే హైప్ క్రియేట్ చేయగలిగారు.
కానీ ఆ సభలో కేసీఆర్ వృద్ధ సింహం గర్జించినట్లు చప్పగా మాట్లాడటం, ముఖ్యంగా బీజేపిని, ప్రధాని మోడీని పల్లెత్తు మాట అనకపోవడం, సభ నిర్వహణలో పార్టీలో కొన్ని వర్గాలను పక్కన పెట్టేయడం వంటివి పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశపరిచాయి.. అని ఎవరో కాదు.. స్వయంగా కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత తండ్రికి లేఖ వ్రాశారు.
ఆ లేఖ లీక్ అయ్యి మీడియా చేతికి చిక్కడంతో బిఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న కోల్డ్ వార్ మరోసారి బయటపడింది.
ముఖ్యంగా కేసీఆర్ బీజేపితో పొత్తు కోసం ఆరాటపడుతున్నారని ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపారని కల్వకుంట్ల కవిత ఆ లేఖలో విమర్శించడం, ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెంటనే ఈ పాయింట్ పట్టుకొని ‘చూశారా.. బిఆర్ఎస్, బీజేపిలు కుమ్మకు అయ్యాయని మేము మొదటి నుంచి చెపుతూనే ఉన్నాము. ఇప్పుడు కవిత కూడా అదే చెప్పారంటూ’ ప్రెస్‌మీట్లు పెట్టి మరీ టామ్ టామ్ చేస్తున్నారు.
రజతోత్సవ సభలో ‘ఇక నేనే స్వయంగా కత్తి పట్టుకొని యుద్ధం చేస్తానన్నట్లు’ మాట్లాడిన కేసీఆర్ మళ్ళీ ఫామ్‌హౌస్‌లో పడుకోవడంతో ఆ పార్టీ పరిస్థితి ఇంకా విషమించింది.
కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకొని కేటీఆర్‌కి పార్టీ పగ్గాలు అప్పగించబోతున్నారనే కొత్త విషయం హరీష్ రావు బయటపెట్టడంతో ఆ పార్టీలో కలకలం మొదలైంది. కేటీఆర్‌కి పగ్గాలు అప్పగించినా తాను ఆయన నాయకత్వంలో పనిచేస్తానని హరీష్ రావు చెప్పారు.
కానీ కేసీఆర్ అలా చేసిన మరుక్షణమే పార్టీని వీడి సొంత కుంపటి పెట్టుకునేందుకు సిద్దంగా ఉన్నారనే ఊహాగానాలు వినిపించడంతో కేటీఆర్ హడావుడిగా హరీష్ రావు ఇంటికి వెళ్ళి భేటీ అయ్యారు.
తద్వారా తమ మద్య ఎటువంటి విభేదాలు లేవని నిరూపించాలని కేటీఆర్ అనుకుంటే, ఆ వరుస భేటీలే బిఆర్ఎస్ పార్టీలో ఏదో జరుగబోతోందనే సంకేతాలు పంపినట్లయింది!
సరిగ్గా ఇదే సమయంలో కల్వకుంట్ల కవిత తండ్రికి వ్రాసిన లేఖ బాంబులా పేలింది. కనుక కేసీఆర్‌కు ఓపిక లేకపోయినా మళ్ళీ కత్తి పట్టుకొని యుద్ధ రంగంలో దిగితే తప్ప బిఆర్ఎస్ పార్టీ బ్రతికి బట్టకట్టదు.