Jagan KCR

రాజకీయాలలో గెలుపోటములు సర్వ సాధారణమైన అంశమే అయినప్పటికీ గెలుపు తాలూకా గర్వం శ్రుతి మించినా, ఓటమి తాలూకా ఆవేదన మోతాదుకు మించినా దాని ఫలితం ఎలా ఉంటుందో నేడు తెలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో స్పష్టమయింది.

పదేళ్ల ఏకఛత్రాధిపత్యం, మనల్ని కదిలించే మొనగాడే లేడు, ఇక ముందు రాడు అన్న అతివిశ్వాసం కేసీఆర్ కోపం ముంచితే, ఐదేళ్ల అధికారం పంతం నిలబెట్టుకోవడానికే అన్న జగన్ మూర్కత్వం వైసీపీ రెక్కలు విరిచింది. అయితే ఈ రెండు పార్టీల మధ్య ఫలితాలు ఎలా ఉన్న వీరు ఎంచుకున్న బాట మాత్రం విమర్శల బరువును మూటకట్టుకున్నాయి.

Also Read – వైసీపీ మళ్ళీ ‘మెగా’ బకరా అయ్యిందా.?

కేసీఆర్, జగన్ అధికారం అందనంత వరకు ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఉద్యమాల పేరుతో ఒకరు దీక్షల పేరుతో మరొకరు ప్రజల మధ్య తిరుగుతూ అధికారం అనే ఓడనెక్కారు. ‘యేరు దాటాక తెప్ప తగలేసినట్టుగా’ ‘ప్రతిపక్షం అనే ఓటమి నుంచి బయటపడ్డాకా ప్రజలు అనే తెప్పను వదలిపెట్టి’ ఒకరు ఫామ్ హౌస్ సీఎం గా మరొకరు ప్యాలస్ సీఎం గా చరిత్ర కెక్కారు.

ఒకరు కూల్చివేతలతో పాలన మొదలుపెడితే మరొకరు ప్రతిపక్ష పార్టీల విలీనం తో ప్రభుత్వాన్ని నడిపించారు. జగన్ ప్రతిపక్ష నేత పై అక్కసు తో రాష్ట్రాన్ని నాశనం చేస్తే, కేసీఆర్ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది ఉండకూడదనే ఆశయంతో ముందుకెళ్లారు. బాబు మీద ఉన్న ద్వేషంతో అటు కేసీఆర్, ఇటు జగన్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని సమాధి చేసారు.

Also Read – అప్పుడు ప్యాకేజ్ స్టార్ ఇప్పుడు ఆదర్శవంతుడయ్యాడా..?

ఒకరు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఏపీలో ఆ కాంగ్రెస్ పార్టీనే భూస్థాపితం చేస్తే, మరొకరు టీడీపీ నుండి బయటకు వచ్చి తెలంగాణలో టీడీపీ పార్టీ ఆనవాళ్లను తుడిచేశారు. ఇద్దరు కూడా తమ తమ రాష్ట్రంలో తమకు రాజకీయ జీవితం ఇచ్చిన పార్టీలను నేలరాశారు. అలాగే ఇద్దరు కూడా సొంత పార్టీలను స్థాపించి అధికారాన్ని దక్కించుకున్నప్పటికీ దాని నిలబెట్టుకోవడంలో నియంతృత్వానికే పెద్ద పీఠ వేసి విమర్శల పాలయ్యారు.

నాయకుడు నియంతగా మారి కనీసం సొంత పార్టీ నేతలకు, క్యాడర్ కు కూడా అందుబాటులో ఉండకపొతే ఏమవుతుందో బిఆర్ఎస్, వైసీపీ పార్టీల గ్రాఫ్ చూస్తే అర్ధమవుతుంది. 2018 ఎన్నికలలో 119 కి గాను 88 సీట్లు దక్కించుకున్న బిఆర్ఎస్ 2023 లో కేవలం 39 సీట్లకు పడిపోయింది. అలాగే 175 గాను 151 సీట్లను సాధించుకున్న వైసీపీ 2024 ఎన్నికలలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక 11 సీట్లకు పరిమితమయ్యింది.

Also Read – మ్యాజిక్ ను రిపీట్ చేయగలరా..?

ఈ ఇద్దరి నాయకుల రాష్ట్రాలు వేరైనా ఉమ్మడి లక్ష్యం ఒక్కటే. అదే టీడీపీ పార్టీ అంతం, ఏపీ రాజధాని అమరావతి నాశనం. అనుకున్నట్టుగానే వీరిద్దరూ వారి చేతిలో ఉన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాదాపు రెండు లక్ష్యాలకు అతి చేరువగా వచ్చి నప్పటికీ అంతిమ విజయాన్ని చేరలేక సొంత పార్టీ నేతల చేతే విమర్శలు ఎదురుకుంటున్నారు.

ఎవరు తీసుకున్న గుంతలో వారే పడినట్లుగా బాబు అరెస్టుతో అటు కేసీఆర్, ఇటు జగన్ వారి అధికారానికి వారే చెక్ పెట్టుకున్నట్లయ్యింది. బాబు అరెస్టు సమయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, కేసీఆర్ మోనం అక్కడ బిఆర్ఎస్ కారుకు బ్రేకులు వేస్తే, ఇటు ఏపీలో బాబు అరెస్టుతో పవన్ తుఫాన్ లో వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగాయి.ఇప్పుడు జగన్ కు ఏపీలో ప్రతిపక్ష హోదా దక్కలేదు, తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలలో కేసీఆర్ తన పార్టీ తరుపున కనీసం ఖాతా కూడా తెరవలేదు.

దీనితో ఆ పార్టీలలో గెలిచిన వారిలో సింహ భాగం అధికార పార్టీ గూటికి చేరుకోవడంతో మళ్ళీ ఆట మొదటి నుంచి మొదలుపెట్టాల్సిన పరిస్థితిని ఎదుర్కుంటున్నారు కేసీఆర్, జగన్. ఇప్పటికే జగన్ తన నెత్తి మీద 30 కి పైగా అవినీతి కేసులు మోస్తూ పదేళ్ల నుండి బెయిలు మీద బయట తిరుగుతున్నారు. అలాగే పదేళ్ల అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడ్డారంటూ కేసీఆర్ కూతురు కవిత అరెస్టయ్యి రెండు నెలలు గడుస్తున్నా ఇంకా బెయిలు రాని పరిస్థితి.




ఇక కేటీఆర్, కేసీఆర్ లను కూడా జైలుకు పంపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న అన్ని దారులను తవ్వి తీస్తుంది. ఇప్పటికే కేటీఆర్ ఫోన్ టాపింగ్ ఆరోపణలతో తర్జనభర్జన పడుతున్నారు. అయితే జగన్ అవినీతి కేసులతో జైలుకు వెళ్లి తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెడితే, ఉద్యమాల పేరుతో అరెస్టులయ్యి తమ రాజకీయ జీవితాన్ని మరోమెట్టు ఎక్కించుకున్నారు కేసీఆర్. ఇలా జైళ్ల దగ్గర మొదలైన వీరి రాజకీయ జీవితం చివరికి జైళ్ల దగ్గరే కలుస్తుందా..?