బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని వాస్తు మార్పులు చేసుకున్నా ఆయన గ్రహస్థితి మాత్రం మారడం లేదు. శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో వరుస ఓటములతో ఓ పక్క పార్టీ ఖాళీ అయిపోతుంటే పార్టీని ఏవిదంగా కాపాడుకోవాలో తెలీక సతమతమవుతున్నారు.
మరోపక్క ఫోన్ ట్యాపింగ్ కేసు, విద్యుత్ కొనుగోలు ఒప్పందం, కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణలు జోరుగా సాగుతున్నాయి. అవి చిల్లర రాజకీయాలని కేసీఆర్ కొట్టిపడేస్తున్నా అవన్నీ కూడా ఆయన మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
అయినప్పటికీ కేసీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ మరో రెండు నెలల్లో రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు రాబోతున్నాయని, మళ్ళీ మనమే అధికారంలోకి రాబోతున్నామంటూ ఎమ్మెల్యేలకు మభ్యపెడుతూ పార్టీ వీడి వెళ్లిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
వారితో సమావేశమైన ప్రతీసారి ఒకరో ఇద్దరో ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిపోతూనే ఉన్నారు. గతంలో కేసీఆర్ కూడా ఇలాగే కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలను తన పార్టీలోకి ఫిరాయించుకున్నందున ఇప్పుడు తన పార్టీలో నుంచి వెళ్ళిపోతున్నవారిపై చేస్తున్న విమర్శలను ప్రజలు కూడా పట్టించుకోవడం లేదు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మూడున్నర నెలలుగా ఢిల్లీ, తిహార్ జైల్లో ఉంటున్న కూతురు కల్వకుంట్ల కవితకు ఎంత ప్రయత్నిస్తున్నా బెయిల్ దొరకకపోవడంతో కేసీఆర్ కుటుంబం చాలా ఆందోళనతో ఉంది.
నిన్న ఒకే రోజు తెలంగాణ హైకోర్టులో కేసీఆర్‌కి, ఢిల్లీ హైకోర్టులో ఆయన కూతురు కల్వకుంట్ల కవితకు ఒకేసారి ఎదురుదెబ్బలు తగిలాయి.
కేసీఆర్ హయాంలో ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో జరిగిన అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహా రెడ్డి కమీషన్ విచారణ జరుపుతోంది. వాటిపై కమీషన్ ఎదుట హాజరయ్యి వివరణ ఇవ్వాలని కేసీఆర్‌కు నోటీస్ పంపగా, దీనిపై విచారణ జరిపే అర్హతే మీకు లేదని, కనుక తక్షణం కమీషన్ నుంచి తప్పుకోవాలంటూ కేసీఆర్ 12 పేజీలతో ఘాటుగా లేఖ వ్రాశారు.
ఆ తర్వాత కమీషన్ రద్దు చేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఆ పిటిషన్‌పై నిన్న విచారణ జరిపిన హైకోర్టు, ఆయన వాదనలు అర్దరహితమని కొట్టిపడేస్తూ, అవకతవకలపై కమీషన్ విచారణ కొనసాగించవచ్చని తీర్పు చెప్పింది.
సరిగ్గా ఇదే సమయంలో ఢిల్లీ హైకోర్టు కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత వేసిన రెండు బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అనూహ్యమైన రాజకీయ పరిణామాలు జరుగబోతున్నాయని కేసీఆర్ చెప్పారు. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయి తాను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని ఆయన ఉద్దేశ్యం కాగా, అందుకు పూర్తి భిన్నంగా బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుంటే, కేసీఆర్, ఆయన కుటుంబం ఇంకా ఇబ్బందులలో కూరుకుపోతూనే ఉంది.




