తెలంగాణ సిఎం కేసీఆర్ మొట్ట మొదటిసారిగా ఓ ఉపఎన్నికను ఎదుర్కోవడానికి తర్జనభర్జనలు పడుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరడంతో ఈ ఉపఎన్నిక వచ్చింది. నిజానికి కేసీఆర్‌కు అగ్నిపరీక్ష పెట్టాలనే ఉద్దేశ్యంతోనే బిజెపి ఆయన చేత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించింది. ఉపఎన్నిక వద్దనుకొంటే ఆయన రాజీనామాను ఆమోదించకుండా పక్కన పెట్టవచ్చు కానీ స్పీకర్ చేత వెంటనే ఆమోదింపజేసి ఈ ఉపఎన్నికను తెచ్చిపెట్టుకొన్నారు కేసీఆర్!
హుజురాబాద్ ఉపఎన్నికలో టిఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డి పోరాడినప్పటికీ బిజెపి చేతిలో టిఆర్ఎస్ ఓడిపోవడంతో ఆ ప్రభావం టిఆర్ఎస్‌పై బాగా పడిన్నట్లుంది. కాంగ్రెస్, బిజెపిలు అభ్యర్ధులను ప్రకటించి ఎన్నికల ప్రచారం చేసుకొంటుండగా, ఇంతవరకు కేసీఆర్ అభ్యర్ధిని ఖరారు చేయలేదు.
పోటీకి ఆసక్తి చూపుతున్న గుత్తా సుఖేందర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిలో ఎవరిని మునుగోడు ఓటర్లు కోరుకొంటున్నారో అని సర్వే చేయిస్తున్నారు. అభ్యర్ధి ఎంపిక విషయంలో కేసీఆర్ ఇంత వెనకంజ వేస్తుండటం బిజెపి విజయంగానే చెప్పవచ్చు. మునుగోడు నియోజకవర్గంలో గ్రామాల వారీగా టిఆర్ఎస్ నేతలు ఆత్మీయ సమ్మేళనలు కూడా నిర్వహిస్తున్నారు.
అంతేకాదు… హుజురాబాద్ ఉపఎన్నికకి ముందు దళితబంధు పధకం ప్రకటిస్తే ఈ ఉపఎన్నికకు ముందు గిరిజన బంధు పధకం ప్రకటించారు. దళిత బంధు పధకంలో ఎంపిక చేయబడిన ఒక్కొక్క దళిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలు (తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు) ఆర్ధికసాయం అందిస్తుంది. ఇప్పుడు గిరిజనులకు కూడా అటువంటి పధకాన్ని కేసీఆర్ ప్రకటించడం విశేషం. అంటే మళ్ళీ బిజెపి చేతిలో మరోసారి ఓడిపోకుండా కేసీఆర్ అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నట్లు అర్దమవుతోంది.
కానీ తెలంగాణలో తిరుగులేదనుకొన్న టిఆర్ఎస్ బిజెపిని చూసి ఇంత భయపడుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కేసీఆర్ అంతటివాడిని భయపెట్టగలుగుతున్న వ్యక్తి ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణలో అసలు బిజెపి ఉందా? అని ఒకప్పుడు ప్రశ్నించిన కేసీఆర్, ఇప్పుడు అదే బిజెపిని చూసి తడబడేలా చేస్తున్నారు.
అయితే సిఎం కేసీఆర్ ఎన్నికల వ్యూహాలని తక్కువ అంచనా వేయలేము. ఇంతవరకు మునుగోడు అభ్యర్ధిని ప్రకటించకుండా తాత్సారం చేస్తున్నది బిజెపిని ఢీకొని ఓడించగల అభ్యర్ధి కోసమేనా లేక కాంగ్రెస్, బిజెపిలను ఆ భ్రమలో ఉంచుతూ నిశబ్ధంగా ముందస్తు ఎన్నికలకి సన్నాహాలు చేసుకొంటున్నారా?అనే సందేహం కలుగుతోంది.
ఏది ఏమైనప్పటికీ మునుగోడు ఉపఎన్నిక టిఆర్ఎస్, బిజెపిల బలాబలాలు తేల్చుకోవడానికే కనుక ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్ గెలిస్తే పర్వాలేదు కానీ ఓడితే మాత్రం టిఆర్ఎస్ నుంచి బిజెపిలోకి ఫిరాయింపులు మొదలవవచ్చు. అదే టిఆర్ఎస్ గెలిస్తే, అదీ భారీ మెజార్టీతో గెలిస్తేనే… హుజురాబాద్ ఓటమికి బిజెపిపై ప్రతీకారం తీర్చుకొన్నామనే తృప్తి తప్ప మరేమి ఒరిగేది ఉండదు.
Exclusive Video Interviews: Watch & Subscribe



