ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో రాజకీయాలు చాలా వేడిగా సాగుతున్నాయి కానీ పూర్తి భిన్నంగా సాగుతున్నాయి. ఏపీలో వైసీపి ప్రభుత్వం తెలుగుదేశాన్ని రాజకీయంగా పూర్తిగా తుడిచిపెట్టేసేందుకు కేసుల ఉచ్చులో ఇరికించేందుకు ప్రయత్నిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
కానీ తెలంగాణలో అధికార బిఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలను కేవలం రాజకీయంగానే ఎదుర్కొంటోంది. ప్రతిపక్షాల కంటే ముందుగా బిఆర్ఎస్ అభ్యర్ధులను ప్రకటించి దూసుకుపోతోంది. అలాగే కాంగ్రెస్, బీజేపీలను రాజకీయంగా ఎండగడుతోంది. నియోజకవర్గ స్థాయిలో బిఆర్ఎస్ వ్యూహాలను అమలుచేస్తోంది. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి గట్టిగా ప్రచారం చేసుకొని ప్రజలను ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నిస్తోంది.
అలాగే కాంగ్రెస్, బీజేపీలు కూడా తమ ప్రత్యర్ధుల కుమ్మక్కు రాజకీయాలను వివరిస్తూ, కేసీఆర్ కుటుంబ, నియంతృత్వ, అవినీతి పాలన గురించి చెప్పుతూ పైచేయి సాధించాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలందరూ హైదరాబాద్‌కు వచ్చి అక్కడ రెండు రోజులపాటు కీలకమైన వర్కింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించి, అనంతరం సభలో ఆరు గ్యారెంటీ స్కీములు ప్రకటించి ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది.
బీజేపీ కూడా ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా తదితర అగ్రనేతలను రాష్ట్రానికి రప్పించి ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తోంది. కనుక తెలంగాణలో రాజకీయాలు ఆరోగ్యకరంగానే సాగుతున్నాయని చెప్పవచ్చు.
కానీ ఏపీలో అధికార వైసీపి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండటం వలన రాజకీయ వాతావరణం చాలా కలుషితమైపోయింది. ఏపీలో ప్రతిపక్షాలే కాదు… కనీసం ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు సైతం తమ సమస్యలు, డిమాండ్స్, జీతాల చెల్లింపులో ఆలస్యం గురించి ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించలేని పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడమే కాకుండా దానిని ఖండిస్తున్న వారిపై సైతం ఆంక్షలు, కేసులు సర్వసాధారణమైపోయాయి.
తెలంగాణలో కేసీఆర్ ఒకే సమయంలో రెండు బలమైన జాతీయ పార్టీలను నిబ్బరంగా ఎదుర్కొంటున్నారు. కానీ ఏపీలో టిడిపి, జనసేనలను మాత్రమే ఎదుర్కోవడానికి వైసీపి ప్రభుత్వం కేసుల పేరుతో ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయించి జైలుకి పంపిస్తూసామాన్య ప్రజలు కూడా ఆగ్రహించేలా చేస్తోంది. ఇంతవరకు అందరూ ఏపీ అభివృద్ధిలో వెనుకపడిపోయింది… రాజధానిలేని రాష్ట్రంగా మిగిలిపోయింది… అప్పుల ఊబిలో కూరుకుపోతోందని మాత్రమే ఆందోళన చెందేవారు. కానీ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పటి నుంచి ఆంధ్రాలో ఈ కలుషిత రాజకీయాలను చూసి సామాన్య ప్రజలు సైతం ఆందోళన చెందుతున్నారు.



