బిఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసేందుకు ఢిల్లీ కేంద్రంగా చర్చలు జరిగాయి అంటూ కేసీఆర్ కుమార్తె కవిత నుంచి ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వరకు బిఆర్ఎస్ నాయకత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయ్యి తీహార్ జైలుకెళ్లిన కవిత ను తిరిగి బయటకు తెచ్చేందుకు, బిఆర్ఎస్ పదేళ్ల పాలన మీద ఎటువంటి విచారణ లేకుండా చేసేందుకు గాను బిఆర్ఎస్ అధిష్టానం బీజేపీ పెద్దలతో విలీన రాజకీయం తో బేరసారాలు జరిపారంటూ కేసీఆర్ ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలతో తెలంగాణ రాజకీయాలలో ఈ అంశం విస్తృతంగా చర్చ జరుగుతుంది.
ఈ వివాదం పై ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఆరోపణలకు తోడు తెలంగాణ బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా తన గొంతు కలిపారు. అలాగే అటు ప్రత్యర్థి కాంగ్రెస్ నాయకుల విమర్శలకు తోడు ఇటు సొంత కుమార్తె కవిత ఆరోపణలు ఈ వివాదానికి మరింత బలం తెచ్చిపెట్టాయి. దీనితో బీజేపీలో బిఆర్ఎస్ విలీనం అనే అంశం తెలంగాణలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది.
అయితే బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఈ విలీన రాజకీయాలు కొత్తేమి కాదు. గతంలో అప్పటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ తో కూడా కేసీఆర్ ఇదే మాదిరి విలీన రాజకీయాలు చేసి కాంగ్రెస్ హై కమాండ్ కు చివరి నిముషంలో ఊహించని ఝలక్ ఇచ్చారు.
సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను ప్రకటిస్తే తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస) ని కాంగ్రెస్ లో విలీనం చేస్తాను అంటూ కాంగ్రెస్ హై కమాండ్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కేసీఆర్ ఆ తరువాత మా క్యాడర్ ఒప్పుకోవడం లేదు మా లీడర్లు మాట వినడం లేదు, తూచ్ అంటూ కాంగ్రెస్ అధినాయకత్వానికి హ్యాండ్ ఇచ్చారు.
ఒకానొక దశలో తన ప్రకటనకు కట్టుబడి ఉన్నాను అనేందుకు గాను ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించిన తరువాత కేసీఆర్ కుటుంబ సమేతంగా, హరీష్ రావు తో కలిసి సోనియా గాంధీ ఇంటికి వెళ్లి మరి పెద్దమ్మకు కృతజ్ఞతలు తెలిపారు. దీనితో కాంగ్రెస్ లో తెరాస విలీనం దాదాపు పూర్తి అయినట్టే అని అందరు భావించారు.
కానీ ఇక్కడే కేసీఆర్ తన రాజకీయ చాణిక్యాన్ని ప్రదర్శించి అటు కాంగ్రెస్ హైకమాండ్ తో పాటు ఇటు తెలంగాణ రాజకీయ పార్టీలకు కూడా ఉహించని షాక్ ఇచ్చారు. ప్రత్యేక తెలంగాణ ప్రకటన వచ్చే వరకు ఈ విలీన ప్రతిపాదనతో కాంగ్రెస్ పార్టీకి గేలం వేసిన కేసీఆర్, ప్రకటన రావడంతో ఆ ప్రతిపాదనను అటకెక్కించి ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయ పోరుకు సిద్ధమయ్యారు.
తెలంగాణలో పదేళ్ల పాటు తన అధికారంతో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయగలిగారు. సరిగ్గా ఇదే మాదిరి కేసీఆర్, కవిత అరెస్టు విషయంలో కూడా బీజేపీ తో విలీన రాజకీయం తెరమీదకు తెచ్చివుంటారా.? ఆ తరువాత కవిత అరెస్టు కథ ఇంటికి చేరడంతో కేసీఆర్ బీజేపీ పెద్దల చెవిలో గులాబీ పువ్వు పెట్టి విలీన ప్రతిపాదనకు శుభం కార్డు వేసారా.? అన్న అనేక ప్రశ్నలు బిఆర్ఎస్ ను వెండాడుతున్నాయి.
కేసీఆర్ విలీన రాజకీయానికి ఉన్న గత ట్రాక్ రికార్డు దృష్ట్యా బీజేపీ – బిఆర్ఎస్ విలీన ప్రక్రియకు ఆస్కారం ఉంటుందా.? తన రాజకీయ అవసరం తీరాక కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి పార్టీని విలీనం చేస్తారు అనుకోవడం జాతీయ పార్టీ అధినేతల వెర్రితనమే అవుతుంది.
నాడు తెరాస ను కాంగ్రెస్ లో విలీనం చేస్తాను అంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు హ్యాండ్ ఇచ్చిన కేసీఆర్, కవిత చెపుతున్నట్టు, ప్రత్యర్థులు ఆరోపిస్తునట్టు బిఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారు అనుకుంటే అది వారి చెవిలో కాషాయ గులాబీ పువ్వు పెట్టినట్టే అవుతుంది.
ఇప్పటికే ఈ వివాదం మీద అటు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి ఇటు బిఆర్ఎస్ నాయకుల వరకు ఈ విలీన ప్రతిపాదన అంశం ను ఖండిస్తూ బిఆర్ఎస్ ఎప్పటికి ఏ పార్టీలోనూ విలీనం కాబోదు, అలాగే ఏ పార్టీతోనూ పొత్తులు కోరుతూ ఎన్నికల బరిలో దిగదు అంటూ కుండబద్దలు కొడుతున్నారు.






