ఏపీ బిఆర్ఎస్‌ దారెటు? జనసేన వైపేనా?

BRS-Thota-Chandrasekhar-KCR-Pawan-Kalyan-JanaSena

జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్‌, ఏపీలో కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నంలో ఆ వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్‌ని ఏపీ బిఆర్ఎస్‌ అధ్యక్షుడుగా నియమించారు. కేసీఆర్‌ మాటలు నమ్మి ఆయనతో పాటు మరికొందరు హైదరాబాద్‌ వెళ్ళి గులాబీ కండువాలు కప్పుకు వచ్చారు. వెంటనే పార్టీ ఆఫీస్ కోసం గుంటూరులో పెద్ద బిల్డింగ్ కూడా కట్టేశారు.

ADVERTISEMENT

కానీ ఆ తర్వాత కేసీఆర్‌ వారివైపు కన్నెత్తి చూడలేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొనేసి అందరినీ కాపాడేస్తానంటూ కేసీఆర్‌ హడావుడి చూసి వాళ్ళు సంతోషపడ్డారు. కానీ కేసీఆర్‌ మళ్ళీ మొహం చాటేశారు.

కనీసం ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల సమయానికైనా కేసీఆర్‌ ఏపీకి వచ్చి ఏమైనా హడావుడి చేస్తారనుకుంటే, తెలంగాణలో ఓడిపోవడంతో ఆయన తలెత్తుకోలేకపోతున్నారు. పైగా లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణలో 17 సీట్లలో కనీసం 9 సీట్లు అయినా దక్కించుకోకపోతే తన నాయకత్వం మీద అందరికీ నమ్మకం పోతుందనే భయంతో ఆయన తెలంగాణ గుమ్మం దాటి అడుగు బయటపెట్టడం లేదు.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా ఇలాగే ఆయనను నమ్ముకొని దెబ్బ తిన్నారు. ఇప్పుడు ఏపీ బిఆర్ఎస్‌ నేతల పరిస్థితి కూడా అదే. కేసీఆర్‌ పట్టించుకోకపోవడంతో ఏమి చేయాలో పాలుపోక జనసేనవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ కేసీఆరే స్వయంగా ఏపీకి వచ్చి ఎన్నికల ప్రచారం చేసినా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో బిఆర్ఎస్‌ అభ్యర్ధులకు డిపాజిట్లు కూడా దక్కే అవకాశం ఉండదు. కనుక తోట చంద్రశేఖర్‌, రావెల కిషోర్ బాబుతో సహా ఆ పార్టీలోని ఉన్న కొద్దిపాటి నేతలు జనసేనలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అయినా కేసీఆర్‌తో సహవాసం అంటే పులి మీద సవారీ వంటిదే అని తెలియక చాలా మంది దీపం చుట్టూ తిరిగే పురుగుల్లా ఆయన చుట్టూ తిరిగి చేతులు కాలాక ఆకులు పట్టుకొని బాధపడుతుంటారు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనుకుని సొంత రాష్ట్రంలోనే ఓడిపోయినందుకు ప్రస్తుతం ఆయన కూడా ఆకులు పట్టుకొని బాధపడుతున్నారు కదా!

ADVERTISEMENT
Latest Stories