kcr-in-assembly for attendance

తెలంగాణ శాసనసభ సమావేశాలలో మొదటిరోజు గవర్నర్ ప్రసంగానికి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ హాజరయ్యారు. కానీ మొన్న, ఈరోజు శాసనసభకు రాలేదు.

మొదటిరోజు ఆయన శాసనసభకు వచ్చినప్పుడు బిఆర్ఎస్ పార్టీ నేతలు ఘనస్వాగతం పలికి చాలా హడావుడి చేశారు. ఇక నుంచి ప్రతీరోజూ శాసనసభ సమావేశాలకు వచ్చి, కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎండగడతారని అందరూ భావించారు.

Also Read – HIT 3: అడివి శేష్ ఫైట్ సీన్ లీక్‌తో సర్‌ప్రైజ్!

కానీ కేసీఆర్‌ మళ్ళీ మొహం చాటేయడంతో శాసనసభలో బిఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ పైచేయి సాదించగలుగుతోంది. కేసీఆర్‌ కేవలం హాజరు వేసుకునేందుకే శాసనసభకు వచ్చారు తప్ప ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు కాదని కాంగ్రెస్‌ మంత్రులు చేస్తున్న విమర్శలకు బిఆర్ఎస్ సభ్యులు సమాధానం చెప్పలేకపోతున్నారు.

శాసనసభలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీయాలని వారు ప్రయత్నిస్తున్న ప్రతీసారి, కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు వారిని ధీటుగా తిప్పి కొడుతున్నారు.

Also Read – వీళ్ళు పాక్ మంత్రులా.. ఉగ్రవాదులా?

శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌ని ఉద్దేశించి బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు, కాంగ్రెస్‌ సభ్యులు చురుకుగా పావులు కదిపి బడ్జెట్‌ సమావేశాలు ముగిసేవరకు ఆయనని సభ నుంచి సస్పెండ్ చేయించారు.

అందుకు నిరసనగా బిఆర్ఎస్ పార్టీ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టగా, “స్పీకర్‌ని అవమానించి రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారంటూ,” కాంగ్రెస్‌ పార్టీ ఎదురుదాడి చేయడంతో బిఆర్ఎస్ నేతలు మరోసారి కాంగ్రెస్‌కు దొరికిపోయారు.

Also Read – సీఎం నినాదాలు: పార్టీ శ్రేణుల అత్యుత్సాహం…


అదే.. కేసీఆర్‌ ప్రతీరోజు శాసనసభ సమావేశాలకు వస్తుంటే అపుడు సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌ మంత్రులే ఆయనకు సమాధానాలు చెప్పలేక తడబడి ఉండేవారు. శాసనసభలో బిఆర్ఎస్ పార్టీ ధీటుగా తన వాదనలు వినిపించగలిగేది. కానీ కేసీఆర్‌ మళ్ళీ మొహం చాటేస్తుండటంతో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాల్సిన బిఆర్ఎస్ సభ్యులు శాసనసభలో తడబడుతున్నారు.