చంద్రబాబు నాయుడు అరెస్టుపై తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎంపీ, సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉంది. తెలంగాణ సిఎం కేసీఆర్, ఏపీ సిఎం జగన్, ప్రధాని నరేంద్రమోడీ ముగ్గురికీ చంద్రబాబు నాయుడు అంటే పడదు.
గతంలో చంద్రబాబు నాయుడు మోడీని తీవ్రంగా వ్యతిరేకించినందున ఆయన కూడా పగబట్టి ఉన్నారు. గత ఎన్నికలలో జగన్‌ను గెలిపించేందుకు కేసీఆర్ వందల కోట్లు ఖర్చు పెట్టారు. కనుక వీరు ముగ్గురూ కలిసే ఈ కుట్ర చేశారు. చంద్రబాబు నాయుడుకి బెయిల్ కూడా రాకుండా చేస్తున్నది వీరు ముగ్గురే.
చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తే ఎల్బీ నగర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి ఇక్కడ ఆంధ్రా ఓట్ల కోసం మొసలి కన్నీరు కార్చారు తప్ప ఇంతవరకు సిఎం కేసీఆర్ కానీ, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గానీ నోరు మెదపలేదు ఎందుకు? వారిద్దరూ కనీసం చంద్రబాబు నాయుడు అరెస్టుని ఖండించడానికి కూడా ఇష్టపడటం లేదు. అంటే ఆయన అరెస్టును సమర్ధిస్తున్నట్లే కదా?ఈ కుట్రలో కేసీఆర్ కూడా ఉన్నారని చెప్పేందుకు ఇదే నిదర్శనం.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేస్తారు. ఎటువంటి బలమైన ఆధారాలు లేకుండానే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసారు. కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు ఎందుకు?అంటే కేసీఆర్, మోడీల మద్య అవగాహన ఉన్నందునే.
కనుక చంద్రబాబు నాయుడుని రాజకీయంగా అడ్డు తొలగించుకొనేందుకే ఈ ముగ్గురూ కలిసి ఈ కుట్ర చేశారని మేము భావిస్తున్నాము. ఇక్కడ కేసీఆర్, అక్కడ ఏపీలో జగన్, ఢిల్లీలో మోడీ మళ్ళీ అధికారంలోకి రావడం కోసమే మూడు పార్టీల మద్య మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యింది,” అని మధుయాష్కీ గౌడ్ అన్నారు.