KCR_Chandrababu_Naidu_Jagan
రిలే రన్నింగ్ రేసులో పాల్గొనే క్రీడాకారులు ఒకరి నుంచి మరొకరికి బ్యాటన్ (చిన్నకర్ర)ను అందించుకొని పరిగెత్తుతూ విజయం సాధించడానికి సమిష్టిగా కృషి చేస్తారు. కనుక వారిలో ఒకరు కాస్త తక్కువ వేగంతో పరుగెత్తిన మరొకరు అంతకంటే ఎక్కువ వేగంగా పరిగెత్తి తమ టీమ్‌కు విజయం సాధిస్తుంటారు.

చంద్రబాబు నాయుడుని కేసీఆర్‌ ఎంతగా ద్వేషిస్తున్నప్పటికీ, హైదరాబాద్‌లో ఐ‌టి రంగాన్ని అభివృద్ధి చేయలేదని వాదిస్తున్నప్పటికీ, ఆయన చంద్రబాబు నాయుడు అందించిన ‘ఐ‌టి బ్యాటన్’ అందుకొని కొడుకు, తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌కు అందజేశారు.

దానిని ఆయన అందిపుచ్చుకొన్న ఆయన చాలా వేగంగా ఐ‌టి రేసులో పరుగులు తీస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని గెలిపించుకొంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్కసారి గెలిపించుకొని ఆయన సంతోషపడి ఊరుకోలేదు. ప్రతీఏడాది గెలిపించుకోవడానికి ‘టీమ్‌-కేటీఆర్‌’ ఆ బ్యాటన్ పట్టుకొని నిరంతరం పరుగులు తీస్తూనే ఉంది. ఏటా రాష్ట్రానికి కొత్త ఐ‌టి కంపెనీలను తెచ్చుకొని లక్షల మందికి ఉద్యోగాలు, లక్షల కోట్ల ఆదాయం సాధించుకొంటూనే ఉన్నారు. అయినా టీమ్‌-కేటీఆర్‌ పరుగు ‘ఆపేదేలే’ అంటూ దూసుకుపోతూనే ఉంది.

తెలంగాణ ఏర్పడిన కొత్తలో అంటే… 2013-14 ఆర్ధిక సంవత్సరంలో ఐ‌టి ఎగుమతుల విలువ రూ.57,258 కోట్లు ఉండగా, అవిప్పుడు అంటే… 2022-23 సంవత్సరంలో రూ.2,41,275 కోట్లు!!!

గత ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే 9.36% పెరిగి, ఈసారి 31.44% వృద్ధి సాధించిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ వృద్ధి విలువ రూ.57,706 కోట్లు అంటే… తెలంగాణ ఏర్పడే నాటికి మొత్తం ఆదాయంతో సమానమన్న మాట!!!

భారత్‌ ఐ‌టి రంగంలో 2022-23 సం.లో మొత్తం 2,90,000 ఉద్యోగాలు సృష్టించబడితే, వాటిలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 1,27,594 ఉద్యోగాలు లభించాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణ ఐ‌టి రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 9,05,71కి చేరిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

ఐ‌టి రంగంలో 2026 నాటికి రూ.3 లక్షల కోట్లు ఆదాయం, 10 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నామని కానీ రెండేళ్ళ ముందుగానే ఆ లక్ష్యం చేరుకోబోతున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

చంద్రబాబు నాయుడు అందించిన ఈ ఐ‌టి బ్యాటన్‌ను ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డిలాగ కేసీఆర్‌ పక్కనపడేయలేదు. ఆయన తన ద్వేషాన్ని, అహంభావాన్ని పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు అందించిన ఆ ‘అక్షయపాత్ర’ను సవినయంగా అందుకొని కొడుకు చేతిలో పెట్టగా ఆయన కూడా దాని విలువను గుర్తించి, సవినయంగా అందుకొని దాంతో తెలంగాణ రాష్ట్రానికి అంతులేని సంపదను, ఉద్యోగాలను, ఉపాధి అవకాశాలను సృష్టించుకొంటున్నారు.

ఐ‌టి రంగం వృద్ధి చెందడం వలన తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, హోటల్, రవాణా, వినోదం, విద్యా, వైద్య, పర్యాటక రంగాలు కూడా సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నాయి. చెందుతున్నాయని అనడం కంటే తెలంగాణ ప్రభుత్వం వాటి విలువను కూడా గుర్తించి సమాంతరంగా అభివృద్ధి చేసుకొంటోందని చెప్పుకోవచ్చు.

కానీ చంద్రబాబు నాయుడు అందించిన ‘అభివృద్ధి బ్యాటన్’ను సిఎం జగన్మోహన్ రెడ్డి ఆయనపై ద్వేషంతో పక్కనపడేసి ‘సంక్షేమ పధకాల బ్యాటన్’ పట్టుకొని మూడు రాజధానులంటూ గమ్యం తెలియని పరుగులు తీస్తూ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని నాలుగేళ్ళుగా ఓడిస్తూనే ఉన్నారు. తన విధానాలు సరైనవేనని ఆయన గట్టిగా నమ్ముతున్నందున ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఇంకా ఇంకా ఓడించాలనే అనుకొంటున్నారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఒకేసారి ఏర్పడినప్పటికీ, తెలంగాణ రాష్ట్రం సరైన దిశలో ప్రయాణిస్తున్నందున నేడు ఎవరికీ అందనంత ఎత్తులో నిలబడగా, ఏపీలో ప్రతీకారాలు, కక్ష సాధింపులు, రంగులు, పేర్లు మార్పులు, మూడు రాజధానులు, సంక్షేమ పధకాలు, అప్పుల బాటలో సాగిపోతుండటం వలన 30-40 ఏళ్ళు వెనకబడిపోయింది. మరో 30 ఏళ్ళు వైసీపీయే అధికారంలో ఉండాలని, ఉంటుందని ఆ పార్టీ నేతలు చెపుతుంటే భయం వేస్తోంది!