కాళేశ్వరంలో చాలా అవకతవకలు, అవినీతి జరిగిందంటూ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి పీసీ ఘోష్ నివేదిక ఇస్తే, అది అంతా భూటకమనీ హరీష్ రావు తేలికగా కొట్టి పడేస్తున్నారు.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆధారిటీ నిపుణులు డిల్లీ నుంచి వచ్చి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలను పరిశీలించి ఆ మూడు చాలా ప్రమాదకరంగా మారాయని నివేదిక ఇస్తే, అది బీజేపీ చేయించిన కుట్రగా హరీష్ రావు అభివర్ణిస్తున్నారు.
కానీ ఈ కమీషన్ నివేదికపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తుంటే దాదాపు ఏడాదిన్నరగా శాసనసభ సమావేశాలకు రాని కేసీఆర్, హాజరయ్యేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
శాసనసభలో ఆ నివేదికని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టేస్తామని హరీష్ రావు చెప్పారు. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం తమపై ఎటువంటి చర్యలు తీసుకున్నా సుప్రీం కోర్టు వరకు వెళ్ళి న్యాయం పోరాటం చేస్తామని చెప్పారు.
కానీ ఇంతకాలం ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి రాని కేసీఆర్, ఇప్పుడు ఈ కేసు తన మెడకు చుట్టుకునేలా కనిపిస్తుండటంతో శాసనసభ సమావేశాలకు వస్తే, ప్రజలకు ఎటువంటి సంకేతాలు వెళతాయో ఆలోచించుకున్నారో లేదో?
ఓ మాజీ ముఖ్యమంత్రిగా, ఓ నియోజకవర్గం ఎమ్మెల్యేగా, రాష్ట్రం పట్ల బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడుగా కేసీఆర్ శాసనసభకు హాజరవుతూ ఉంటే, ఇప్పుడు వెళ్ళినా చాలా హుందాగా ఉండేది. కానీ ఇంతకాలం మొహం చాటేసి ఇప్పుడు వెళితే తనని తాను కాపాడుకోవడం కోసమే వెళుతున్నారని ప్రజలు అనుకోకుండా ఉంటారా?
అలాగని వెళ్ళకుండా ఫామ్‌హౌస్‌లో ఉండిపోయినా సిఎం రేవంత్ రెడ్డి ఊరుకోరు. పీసీ ఘోష్ కమీషన్ కమీషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్ అవినీతిపై చర్చ జరుగుతుంటే భయంతో ఫామ్‌హౌస్‌లో దాక్కొన్నారు. ఆయన ఎక్కడ దాక్కున్నా పట్టుకొని జైలుకి పంపుతామని సిఎం రేవంత్ రెడ్డి గర్జించకుండా ఉండరు.
కనుక కేసీఆర్‌కి ఈ నివేదిక, ఈ సమావేశాలు, ఈ కేసు అన్నీ చాలా ఆందోళన కలిగించేవే. మరి ఎలా నెగ్గుకొస్తారో?






