ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యి ఇప్పటికీ రెండు నెలలు పైనే అయ్యింది. ఇంకా బెయిల్ లభించడం లేదు.
దీనిపై కేసీఆర్ ఏమి చెపుతున్నారంటే, “ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది లేనే లేదు. ఇది మోడీ, ఈడీ కలిసి సృష్టించిన ఓ స్కీమ్. మా నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి నా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించి బీజేపీ అడ్డంగా దొరికిపోయింది.
అప్పుడు ఈ కుట్రకి మూలకారకుడైన బీజేపీ సీనియర్ నేత బిఎల్ సంతోష్‌ని అరెస్ట్ చేయించేందుకు నేను తెలంగాణ పోలీసులను ఢిల్లీలోని బీజేపీకి కార్యాలయానికి పంపాను. ఆ కక్షతోనే మోడీ నా కూతురుని ఈ కేసులో ఇరికించి అరెస్ట్ చేయించారు. కానీ ఆమె కడిగిన ఆణిముత్యంలా బయటకు వస్తుంది.”
కానీ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన తెలంగాణ టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్‌డీ రాధాకిషన్ రావు సిట్ బృందానికి ఇచ్చిన వాగ్మూలంలో అసలు విషయం బయట పెట్టారు.
నిజానికి కేసీఆర్ చెప్పుకుంటున్నట్లుగా నలుగురు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీలోకి ఆకర్షించాలని ప్రయత్నించలేదని, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఒక్కరి కోసమే ప్రయత్నించిందని చెప్పారు.
ఈ విషయం తెలుసుకున్న కేసీఆరే మరో ముగ్గురి ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని పైలట్ రోహిత్ రెడ్డి చేత బీజేపీ ప్రతినిధులను నమ్మించి ట్రాప్ చేశారని పేర్కొన్నారు.
మరో ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ముందుగానే స్పై కెమెరాలు పెట్టించి, ముగ్గురు బీజేపీ ప్రతినిధులను రెడ్ హ్యాండ్‌గా పట్టుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేశారని రాధాకిషన్ రావు వాగ్మూలంలో పేర్కొన్నారు.
అయితే ఈ కేసులో బిఎల్ సంతోష్, కేరళలో మరొకరిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టగలిగితే, కూతురు కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ కేసులో మోడీ, అమిత్ షాలతో ధైర్యంగా బేరసారాలు చేసుకోవచ్చని కేసీఆర్ ప్లాన్ చేశారని రాధాకిషన్ రావు వాగ్మూలంలో పేర్కొన్నారు.
కానీ తాము కేసీఆర్‌కి అందించిన ఫామ్‌హౌస్ ఆడియో వీడియో ఫుటేజీని మునుగోడు ఉప ఎన్నికలలో కూడా బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉపయోగించుకోవచ్చనే ఆలోచనతో, వాటిని మీడియాకు రిలీజ్ చేసేశారని దాంతో ఈ కేసు ఆయన చేతిలో నుంచి జారిపోయి సీబీఐ చేతిలోకి వెళ్లిపోయిందని రాధాకిషన్ రావు వాగ్మూలంలో పేర్కొన్నారు.
రాధాకిషన్ రావు, తెలంగాణ స్పెషల్ ఇంటలిజన్స్ బ్యూరో (ఎస్‌ఐబి) ప్రభాకర్ రావు, డీఎస్పీ ప్రణీత్ రావు ముగ్గురూ సంప్రదింపులు జరుపుతూ ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ‘పెద్దాయన’కు చేరవేస్తుండేవారిమని తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
ప్రతిపక్ష నేతలే కాకుండా కేసీఆర్ సొంత పార్టీ నేతల ఫోన్లు, రియల్ ఎస్టేట్ తదితర ప్రముఖ వ్యాపారుల ఫోన్లు కూడా తమ చేత ట్యాపింగ్ చేయించారని రాధాకిషన్ రావు వాగ్మూలంలో పేర్కొన్నారు.
కానీ నేటికీ కేసీఆర్ లిక్కర్ స్కామూ లేదూ గీమూ లేదని వాడిస్తుంటారు. కేసీఆర్ తమనే దెబ్బకొట్టాలని ఇంత పెద్ద స్కెచ్ వేశారు కనుకనే మోడీ, అమిత్ షాలు కూడా ఆయన పట్ల కటువుగా ఉన్నారని, బహుశః అందుకే కల్వకుంట్ల కవితకు బెయిల్ దొరకడం లేదని భావించవచ్చు.




