KCR-Jagan-Buttonనేడు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌ ఇద్దరూ బటన్ నొక్కబోతున్నారు.

ఏపీ సిఎం జగన్‌ నేడు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో బటన్ నొక్కి కాపు నేస్తం పధకం కింద రూ.536.77 కోట్లు నిధులు విడుదల చేయబోతున్నారు. ఈ పధకం ద్వారా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన 3,57,844 మంది మహిళలకు ఒక్కొక్కరి ఖాతాలో రూ.15,000 చొప్పున నేడు జమా చేయబోతున్నారు.

తెలంగాణ సిఎం కేసీఆర్‌ నేడు నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకాన్ని బటన్ నొక్కి ప్రారంభించబోతున్నారు. రూ.55,086 కోట్లు వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలోని రంగారెడ్డి, వికారాబాద్‌, నల్గొండ, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌, మహబూబ్ నగర్‌ ఆరు జిల్లాలలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 1,226 గ్రామాలకు స్వచ్చమైన త్రాగునీరు లభిస్తుంది.

జగన్‌ సర్కార్ సంక్షేమ పధకాల పేరుతో లక్షల కోట్లు అప్పులు తెచ్చి ప్రజలకు పంచిపెడుతుంటే, తెలంగాణ సర్కార్ లక్షల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తూ రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాలను సాగులోకి తెస్తోంది. సంక్షేమ పధకాలతో ఏపీలో 97 శాతం ప్రజలకు మేలు చేస్తున్నామని జగన్‌ చెప్పుకొంటుంటే, సాగునీటి పధకాల వలన తమ జీవితాలలో వెలుగులు నిండుతున్నాయని తెలంగాణ ప్రజలు చెప్పుకొంటున్నారు.

సంక్షేమ పధకాల కోసం జగన్‌ సర్కార్ చేస్తున్న అప్పులు కొండల్లా పేరుకుపోతుంటే, ఆ భారం లబ్ధిదారులతో సహా రాష్ట్రంలో ప్రజలందరిపై పడుతోంది. సాగునీటి ప్రాజెక్టుల కోసం తెలంగాణ సర్కార్ కూడా అప్పులు చేస్తున్నప్పటికీ, ఏటా లక్షలాది ఎకరాలు కొత్తగా సాగులోకి వస్తుండటంతో భారీగా పంటలు పండుతున్నాయి. భూగర్భ జలాలు, పచ్చదనం పెరుగుతోంది. భారీగా ఉపాధి.. దాంతో ఆదాయం లభిస్తోంది.

ఏపీలో ప్రజలకు సంక్షేమ పధకాలను అలవాటు చేసి ఎప్పటికీ ప్రభుత్వంపై ఆధారపడేలా చేస్తుంటే, తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఐటి కంపెనీల ద్వారా ప్రజలు స్వయంగా సంపాదించుకొని ప్రభుత్వంతో సహా ఎవరి మీద ఆధారపడకుండా జీవించేలా చేస్తోంది.

సంక్షేమ పధకాల అంతిమ లక్ష్యం లబ్ధిదారులందరి చేత వైసీపికి ఓట్లు వేయించుకోవడమే అని జగన్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలే చెప్పుకొంటున్నారు. అయితే తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల ద్వారా తమ ప్రాంతాలు సస్యశ్యామలం అవుతుండటం చూసి ప్రజలే బిఆర్ఎస్‌ పార్టీకి ఓట్లు వేసేందుకు సిద్దపడుతున్నారు.

ఏపీలో దశాబ్ధాల క్రితం మొదలుపెట్టిన పోలవరం ప్రాజెక్టు నేటికీ పూర్తికాలేదు. కానీ తెలంగాణ ఏర్పడిన 9 ఏళ్ళలోనే దేశంలోకే అతిభారీ ప్రాజెక్టులైన కాళేశ్వరం, ఇప్పుడు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తిచేసింది.

ఏపీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాలుగా ఒకేసారి ఏర్పడ్డాయి. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో దూసుకుపోతుంటే, ఏపీలో మాత్రం రాజకీయకక్ష సాధింపులు, రకరకాల మాఫియాలు, దౌర్జన్యాలు, అప్పులు, రకరకాల పేరుతో ప్రజలపై ఛార్జీల బాదుడు మాత్రమే కనిపిస్తున్నాయి. రెండు రాష్ట్రాలలో ఇంత తేడా.. ఎందువల్ల?