గత నాలుగు రోజులుగా తెలంగాణలో అధికారం, ప్రతిపక్షం, HCU విద్యార్థుల మధ్య రగులుతున్న కంచ గచ్చిబౌలి 400 ఎకరాల భూ వివాదం పై స్పందించడానికి ప్రతిపక్ష నాయకుడు, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కనీసం ఒక్క ప్రకటన కూడా విడుదల చెయ్యలేదు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం, పదేళ్లు ముఖ్యమంత్రి హోదా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ ఆత్మ గౌరవానికి నిలువెత్తు రూపం అంటూ కేసీఆర్ పై బిఆర్ఎస్ నాయకులు చేసే ఊకదంపుడు ప్రసంగాలు కేవలం స్వకార్యానికి చేసే స్వామి పూజ వంటివా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కొన్ని వేల కోట్లు విలువ చేసే తెలంగాణ సంపద మీద ఇంటా, బయట, న్యాయస్థానాలలో ఇంత రచ్చ జరుగుతున్నప్పటికీ కేసీఆర్ కనీసం స్పందించడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు, విపక్ష సభ్యులు పోరాటాలు చేస్తున్నా, ప్రతిపక్షాలను బేఖాతరు చేస్తూ ప్రభుత్వం ముందుకెళుతున్నా, న్యాయస్థానాలు స్టే పేరుతో ప్రభుత్వ చర్యలకు బ్రేకులు వేసినా కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ గడప దాటలేదు. మీడియా ముందుకు రాలేదు.
బిఆర్ఎస్ పార్టీ తరపున కేటీఆర్, హరీష్ స్పందిస్తున్నప్పటికీ ఆ పార్టీ అధినేతగా, మాజీ ముఖ్యమంత్రిగా ప్రజలకు ఇటువంటి అంశాల మీద పూర్తి అవగాహన కల్పించడం, ప్రభుత్వానికి తగిన సూచనలు చేయడం కేసీఆర్ బాధ్యత అవుతుంది. కానీ పదవి లేకుంటే ప్రజలు, ప్రజా సమస్యలు పట్టవు అన్నట్టుగా కేసీఆర్ వ్యవహరించడం అది ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అవుతుంది.
ఉద్యమాల పేరుతో ప్రజలను రెచ్చకొట్టి వారి ప్రాణాలతో రాజకీయం చేసే బిఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కూడా ఈ 400 ఎకరాల భూ వివాదంలోకి వారికి సంబంధం లేని HCU విద్యార్థులను లాగి తమ రాజకీయ లబ్ది కోసం విషయాన్ని వివాదం గా మార్చారు అంటూ కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ నేతల పై మండిపడుతున్నారు.
అలాగే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి జరగాలంటే కొన్ని కోల్పోవాల్సి వస్తుందని, గతంలో హైద్రాబాద్ లో జరిగిన అభివృద్ధిని కూడా విపక్ష పార్టీలు ఇలా నిలువరించి ఉంటే హైద్రాబాద్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేదా అనేది కాంగ్రెస్ నాయకుల వాదన. ఇలా ప్రభుత్వం తన వాదన తానూ వినిపిస్తుంది, విద్యార్థులు నిరసన పేరుతో తమ అభిప్రాయాన్ని తాము వ్యక్తపరుస్తున్నారు, ఇక బీజేపీ, బిఆర్ఎస్ నాయకులు విమర్శల పేరుతో తమ రాజకీయం తాము చేస్తున్నారు
కానీ మాజీ ముఖ్యమంత్రి గా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ మాత్రం ఇవేమి పట్టనట్టు తన ఫామ్ హౌస్ జీవితం తానూ గడుపుతున్నాడు అనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది. రాష్ట్రానికి అత్యంత కీలమైన అంశంలో కూడా కేసీఆర్ ఇలా మౌనంగా ఉండడంతో ఓటమితో కేసీఆర్ రాజకీయంగా అస్త్ర సన్యాసం చేసారా అనిపిస్తుంది. కేసీఆర్ మౌనం ఆయన రాజకీయ జీవితానికే కాదు బిఆర్ఎస్ భవిష్యత్ కు కూడా ప్రమాదమే అనేది కేసీఆర్ ఇప్పటికైనా గ్రహించాలి.




