తెలంగాణలో అభివృద్ధి… ఏపీలో సంక్షేమ పధకాలు… ఏది బెటర్?

Jagan-Kcrతెలంగాణ సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన బుదవారం తెలంగాణ భవన్‌లో బిఆర్ఎస్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. వారిని ఉద్దేశ్యించి కేసీఆర్‌ మాట్లాడుతూ, “ఈ తొమ్మిదేళ్ళలో మన ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించండి. దశాబ్ధాలుగా సాధ్యం కాని అభివృద్ధిని మన ప్రభుత్వం కేవలం తొమ్మిదేళ్ళలో సాధించి చూపినందునే యావత్ దేశ ప్రజలు తెలంగాణవైపు చూస్తున్నారు. సాగు,తాగునీరు, విద్యా, వైద్యం, విద్యుత్‌, పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలికవసతుల కల్పన, ఉద్యోగాల కల్పన, పర్యావరణం… ఇలా ప్రతీ రంగంలో మన తెలంగాణ రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి సాధించింది. రాష్ట్రాభివృద్ధితో పాటు రాష్ట్రంలో అన్ని వర్గాలకు అనేక సంక్షేమ పధకాలు అందజేస్తున్నాము.

ADVERTISEMENT

మీరందరూ మీమీ ప్రాంతాలలో చెరువులు, పొలాల గట్ల వద్దనే ప్రజలతో భోజన సమావేశాలు పెట్టుకొని ఇవన్నీ వివరించండి. మనం సాధించిన అభివృద్ధి, అమలుచేస్తున్న సంక్షేమ పధకాల గురించి తెలంగాణ జానపదకళారూపాలతో, డిజిటల్ స్క్రీన్ ప్రదర్శలతో ప్రజలకు వివరించండి.

అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ స్థానిక నేతలతో, స్థానిక సంస్థల ఛైర్మన్లు, సభ్యులతో విభేధాలున్నట్లయితే బేషజాలు పక్కన పెట్టి వారిని భోజనాలకు ఆహ్వానించి సమస్యలను, బేధాభిప్రాయాలను పరిష్కరించుకోండి. నేను చెప్పిన్నట్లుగా చేస్తే వచ్చే ఎన్నికలలో ఒక్కొక్కరూ కనీసం 50వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారు. మీరందరూ గెలిస్తే పార్టీ గెలుస్తుంది.

వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ 95-105 స్థానాలు గెలుచుకొని మళ్ళీ మనమే అధికారంలోకి రాబోతున్నాము. కనుక మీ అంతటా మీరు చెడగొట్టుకొంటే తప్ప మీకు ఓటమి లేదు…. వేరే వారికి టికెట్లు ఇచ్చే ఆలోచన లేదు నాకు. కనుక అందరూ కలిసి కట్టుగా పనిచేస్తూ మిమ్మల్ని మీరు, పార్టీని గెలిపించుకోండి. కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయాన్ని పట్టించుకోనవసరం లేదు,” అని మార్గదర్శనం చేశారు.

అదే… ఏపీ సిఎం జగన్‌ తన మంత్రులు, ఎమ్మెల్యేలకు ఏమి చెపుతుంటారంటే, “మన ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ సంక్షేమ పధకాలతో మేలు చేసింది. నేను నెలనెలా ‘బటన్ నొక్కి’ పధకాలకు నిధులు విడుదల చేస్తున్నాను. ఇదే విషయం మీరు ప్రజలకు చెప్పుకొని ఓట్లు అడగాలి. మన సంక్షేమ పధకాలే మనల్ని గెలిపిస్తాయి. ప్రతిపక్షాలన్నీ కట్టకట్టుకొని వస్తున్నాయి. అయినా ఈసారి 175 సీట్లు మనమే గెలుస్తాము,” అని చెపుతుంటారు.

తెలంగాణ సిఎం కేసీఆర్‌ తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, సంక్షేమ పధకాలను చూసి ఓట్లేయాలని కోరుతుంటే, ఏపీ సిఎం జగన్‌ కేవలం సంక్షేమ పధకాలను చూసి ఓట్లేయాలని ప్రజలను కోరుతున్నారు. అయితే అభివృద్ధి ఫలాలు రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ చేరుతాయి కానీ సంక్షేమ పధకాలు కేవలం వైసీపీకి ఓట్లు వేస్తారనుకొనే వారికి మాత్రమే పరిమితం. అంటే వారు ఓట్లేస్తే చాలని జగన్‌ భావిస్తున్నట్లు అర్దమవుతోంది.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇంతగా అభివృద్ధి చేసినా కేసీఆర్‌ 117 సీట్లు మనమే గెలుచుకొంటామని చెప్పుకోవడం లేదు. కానీ ఏపీని అసలు అభివృద్ధే చేయకుండా 175 సీట్లు మనమే గెలుచుకొంటామని జగన్‌ చెప్పుకొంటున్నారు. చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోమని కేసీఆర్‌ సూచిస్తుంటే, “మీ అందరి నమ్మకం నేనే” అంటూ తన ఫోటో స్టిక్కర్స్ ప్రతీ ఇంటికీ అంటించమని జగన్‌ సూచిస్తున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రుల ఆలోచనలు, విధానాలు, వైఖరిలో ఎంత తేడా! వీరిలో ఎవరి వైఖరి బాగుందో వేరే చెప్పక్కరలేదుగా?

ADVERTISEMENT
Latest Stories