తెలంగాణాలో కేసీఆర్ కు భాజపాకు చీకటి ఒప్పందం చేసుకుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కు 2019లో రూట్ క్లియర్ చెయ్యడానికే తెదేపాతో పొత్తు వద్దు అని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారని రేవంత్ ఆరోపించారు. 50000 వేల ఓట్లకు గాను సింగరేణి ఎన్నికల్లో భాజపా అభ్యర్ధికు వచ్చిన ఓట్లు 248. వారికి ఎందుకు వద్దు తెదేపాతో పొత్తు? అని ప్రశ్నించారు.
“ఒక భాజపా సీనియర్ నాయకుడు నాకో విషయం చెప్పారు. తెదేపా ఎన్డీఏలో డైరెక్ట్ గా ఉంది, తెరాస ఇన్‌డైరెక్ట్గా ఉంది అదే తేడా అని చెప్పారు. అదేంటి అని అడిగితే. కేసీఆర్ నోట్ల రద్దుని సమర్దించారు. జీఎస్టీ ని సమర్దించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మాకు వోట్ వేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ మాకే వేశారు. అందుకే మరి అని ఆయన అన్నారు,” అని రేవంత్ చెప్పారు.
మంగళవారం రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి అధికారికంగా చేరనున్నారు. ఆయనతోపాటు పలువురు టీడీపీ ముఖ్యులు కూడా కాంగ్రెస్‌లో చేరతారు. డిసెంబర్ లో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర కూడా చెయ్యాలని రేవంత్ భావిస్తున్నారు. వచ్చే 6 నెలలో ఎప్పుడైనా కోడంగల్ కు ఉపఎన్నిక రావొచ్చు.
ఈ ఎన్నికల సందర్భంగా కూడా రేవంత్‌ను ఓడించడానికి టీఆర్‌ఎస్ శతవిధాల ప్రయత్నించబోతుంది. అధికార పక్షాన్ని తట్టుకొని గెలిస్తే కేసీఆర్ కు సరైన నాయకుడుగా రేవంత్ ఎదుగుతాడు. ఒకవేళ ఓడిపోతే తన ఆశలకు కళ్ళెం పడినట్టే. ఈ ఎన్నికల్లో తెదేపా, భాజపా అభ్యర్ధులను నిలబెడతారో లేదో చూడాలి!


