తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరా రావు ఢిల్లీ వైపు అడుగులు వడివడిగా వేస్తున్నారు. మొత్తంగా ఒక ప్లాన్ ప్రకారం కేసీఆర్ ను జాతీయ స్థాయి నాయకుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సరిగ్గా నాలుగు గంటలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పాపెట్టకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు.
మాములుగా ఒక పార్టీ గురించో ఒక నాయకుడి గురించో ఇంకొక నాయకుడు మాట్లాడాలంటే ఏదన్నా తన సొంత విషయం ప్రెస్ మీట్ పెట్టిన తరువాత తన విషయం అయిపోయాక చివరిలో ఆ విషయం గురించి మాట్లాడుతారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రత్యేకంగా కేసీఆర్ ను పొగడటం కోసమే ప్రెస్ మీట్ పెట్టి, ఆ పని అయిపోయాక ప్రెస్ మీట్ ముగించేశారు.
“దేశ రాజకీయాలపై కేసీఆర్ కు లోతైన అవగాహన ఉంది. థర్డ్ ఫ్రంట్ కు కేసీఆర్ అంకురార్పణ చేస్తే నేను మద్దతిస్తాను, రక్తం చిందించకుండా రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ దే,” అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అసలు ఉన్నఫళంగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారో ఆయన అభిమానులకే అర్ధం కాలేదు. అదే సమయంలో తెరాస కార్యాలయం నుండి మీడియాకు కొన్ని లీకులు ఇచ్చింది.
మధ్యాహ్నం మమతా బెనర్జీ ఫోన్ చేసి మద్దత్తు తెలిపారని, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ చేసి సంఘీభావం ప్రకటించారని, మహారాష్ట్రకు చెందిన కొంతమంది ఎంపీలు సపోర్ట్ ఇచ్చారని ఆ వర్గాలు మీడియాకు చెప్పాయి. ఈ లీకులు టీవీలో స్క్రోలింగ్ లాగా వచ్చే టైం లోనే తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి తెరాస క్యాడర్ ప్రగతి భవన్ వద్దకు వచ్చి కేసీఆర్ ను జాతీయ స్థాయిలో చూడాలని భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఆ హడావిడికి కేసీఆర్ బయటకు వచ్చి వారిని ఉద్దేశించి సినిమాలలో హీరో లెక్క ప్రసంగించారు.
మధ్యమధ్యలో హిందీలో కూడా రెండు ప్రధాన జాతీయ పార్టీలను విమర్శిస్తూ వారి విధానాల పై విరుచుకుపడ్డారు. మమతా బెనర్జీ నువ్వు ఎలా అంటే అలా చేద్దాం తమ్ముడు అన్నారని చెప్పుకొచ్చారు కేసీఆర్. రైతు పెట్టుబడి పథకం చెప్పగానే రాజనాధ్ సింగ్ కుర్చీ మీద నుండి పడినంత పని చేశారని చెప్పుకొచ్చారు. మొత్తానికి కేసీఆర్ కు జాతీయ రాజకీయాలపై మక్కువ గట్టిగానే ఉన్నట్టు ఉంది. దానికి తగ్గ గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నట్టుగానే ఉంది.



