ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. ఇద్దరి నెత్తి మీద కేసుల కత్తులు వ్రేలాడుతున్నాయి. ఎదురే లేదనుకున్న రెండు పార్టీలు అడ్రస్ లేకుండా పోయేలా ఉన్నాయి. కనుక ఇద్దరికీ ‘జాతీయ రక్షణ కవచాలు’ చాలా అవసరం.
ఇద్దరూ మంచి స్నేహితులే ఆయినప్పటికీ తమ సమస్యలు, అవసరాలను బట్టి వేర్వేరు దారులలో ప్రయాణించక తప్పడం లేదు. నాలుగు నెలలుగా తిహార్ జైల్లో మగ్గుతున్న కూతురు కల్వకుంట్ల కవితని విడిపించుకోవడానికి, రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీని కాపాడుకొని ఏదోవిదంగా అధికారం చేజిక్కించుకోవడానికి కేసీఆర్ తెర వెనుక బీజేపీతో మంతనాలు చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిని ఎవరూ ఖండించడం లేదు. అంటే అవి నిజమే అనుకోవచ్చు. కానీ ఇప్పుడు అవసరం కేసీఆర్‌దే తప్ప బీజేపీది కాదు కనుక బిఆర్ఎస్ పార్టీతో పొత్తుకి బీజేపీ అంగీకరించకపోవచ్చు. కానీ లోపాయికారిగా పరస్పరం సహకరించుకునే అవకాశం ఉంది.
కేసీఆర్ బీజేపీవైపు చూస్తుంటే, జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు ఢిల్లీ ధర్నాతో స్పష్టమైంది. కాంగ్రెస్ మిత్రపక్షాలు వచ్చి సంఘీభావం తెలిపాయి. వైఎస్ షర్మిల బెడద వదిలించుకుని రాష్ట్రంలో వైసీపిని కాపాడుకునేందుకే జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. రాష్ట్ర విభజనతో ఏపీలో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ నేటికీ ఏపీలో కోలుకోలేకపోతోంది.
కనుక వైఎస్ షర్మిలకి పగ్గాలు అప్పగించింది. కానీ ఆమె ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. కనీసం ఒక్క సీనియర్ వైసీపి నేతని కాంగ్రెస్ పార్టీలో రప్పించలేకపోయారు.
కనుక ఆమె కంటే వైసీపిని కాంగ్రెస్‌లో విలీనం చేసి, తమ నాయకత్వాన్ని అంగీకరించేందుకు సిద్దపడుతున్న జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలా మేలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తే ఆశ్చర్యం లేదు. అదీగాక ఏపీలో కాంగ్రెస్, వైసీపి రెండూ ఒకే పరిస్థితిలో ఉన్నాయి కూడా. కనుక కాంగ్రెస్‌లో వైసీపి విలీనమయ్యే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే, జగన్, కేసీఆర్ ఇద్దరిదీ ఎవరి దారి వారిదే అవుతుంది.
కానీ ప్రధాని నరేంద్రమోడీని అవమానించి, అవహేళన చేసి, గద్దె దించాలనుకున్న కేసీఆర్‌కి బీజేపీ తోడ్పడుతుందా?ఒకవేళ కేసీఆర్‌తో బీజేపీ రహస్య అవగాహన చేసుకుని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు సిద్దపడితే, ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు చూస్తూ ఊరుకుంటారా?
ఏపీ కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిలని పంపించిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఆమెను బయటకు పంపించి జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకుంటానంటే అంగీకరిస్తారా?అనే ప్రశ్నలకు రాబోయే రోజుల్లో సమాధానాలు లభిస్తాయి.




