పార్టీలో ఉన్న వారేమో అధికార పార్టీలోకి వెళ్లిపోతుంటే… పార్టీలోకి వచ్చిన ఒకరిద్దరిపై ఏదొక వివాదం చుట్టుముడుతోంది. కర్నూలు జిల్లా నేతలంతా టిడిపి బాట పడుతుంటే, మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కోడుమూరు మురళీకృష్ణ ఇటీవల వైసీపీలో చేరి షాక్ ఇచ్చారు. అయితే తాజాగా కోడుమూరుపై నమోదైన కేసుతో వైసీపీ వర్గాలకు షాక్ తగిలినట్లయ్యింది.
ఓ భూ వివాదానికి సంబంధించి ఓ వ్యక్తిని నిర్భంధించారన్న ఆరోపణలతో ఫిర్యాదు అందుకున్న కర్నూలు రెండవ పట్టణ పోలీసులు కోడుమూరుతో సహా మరో 8 మందిపై కేసు నమోదు చేసారు. ఈ వివాదంతో సంబంధమున్నట్లు తేలడంతో పోలీస్ వర్గాలు మురళీకృష్ణను అరెస్ట్ చేయడానికి కూడా సిద్ధమయ్యారు. అయితే ఈ సమాచారం అందుకున్న కోడుమూరు, అరెస్ట్ నుండి తప్పించుకునేందుకు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
దీంతో తలపట్టుకోవడం వైసీపీ నేతల వంతువుతోంది. అసలే జిల్లలో నాయకులు లేక వెలవెలబోతున్న పార్టీలోకి ఇటీవలే వచ్చిన నేత కూడా ఇలా కేసుల బారిన పడి, పరారవ్వడం పార్టీ వర్గాలు సిగ్గుచేటు ప్రక్రియగా భావిస్తున్నారు. మొత్తమ్మీద రాయలసీమలో జగన్ పార్టీకి వీస్తున్న ఎదురుగాలి ఇప్పట్లో ఆగేలా కనపడడం లేదు.



