విడుదలైన ప్రతి సెంటర్ లో అభిమానులు, సినీ ప్రేక్షకుల అమోఘమైన స్పందనతో “భీమ్లా నాయక్” మారుమ్రోగుతోంది. యుఎస్ ప్రీమియర్స్ షో మొదలుకుని, రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదలైన ‘భీమ్లా నాయక్’కు ప్రేక్షకులు పట్టాభిషేకం చేసారు. ఏపీ మినహాయిస్తే, మిగిలిన ప్రధాన కేంద్రాలలో మొదటి రోజు ఆల్ టైం రికార్డులు అందుకునే దిశగా ‘భీమ్లా నాయక్’ పరుగులు పెడుతోంది.
జీవో నెంబర్ 35 ప్రకారం తాము ధియేటర్లలో సినిమాను ప్రదర్శించలేమని యాజమాన్యం స్వచ్ఛందంగా తాళాలు వేయడంతో, దాదాపుగా కొన్ని వందల ధియేటర్లు నేడు మూతపడ్డాయి. ఇది ‘భీమ్లా నాయక్’కు చాలా ఎదురు దెబ్బ. ఈ విధంగా పవన్ సినిమాను చావు దెబ్బ తీయడంలో జగన్ సర్కార్ సఫలీకృతం అయ్యింది. ఈ ప్రభావం వలన ఫుల్ రన్ లో దాదాపుగా 20 నుండి 25 కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు లెక్కలు కడుతున్నారు.
ఇదిలా ఉంటే ఏపీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానీలు గుడివాడలోని జీ3 భాస్కర్ ధియేటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేయగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ వీరిని అడ్డుకున్నారు. పోలీసులు అభిమానులను నియంత్రించే ప్రయత్నం చేయగా, అభిమానులు వారించడంతో కొందరిని అదుపులోకి కూడా తీసుకున్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ సెగను ఈ ఇద్దరు మంత్రులు కొంతమేరకు చవిచూడాల్సి వచ్చింది.
ఇక ధియేటర్ ను ప్రారంభించి లోన సీట్లల్లో కూర్చుని ఉన్న ఈ ఇద్దరి మంత్రుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బయట ఫ్యాన్స్ సెగ చూసిన ఇద్దరు మంత్రులు లోనకెళ్లి ‘భీమ్లా నాయక్’ సినిమా చూస్తున్నారంటూ ఈ ఫోటోను పోస్ట్ చేసి కామెంట్స్ పెడుతున్నారు. అలాగే సినిమాలో మన మీద ఏమన్నా సెటైర్లు ఉన్నాయేమో చూసి రమ్మని ఈ ఇద్దరు మంత్రులను జగన్ పంపించినట్లుగా ఈ పిక్ పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
ఇటీవల సినిమా టికెట్ ధరల విషయంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న పేర్ని నాని మరియు సినిమా శాఖకు సంబంధం లేకపోయినా, ఈ అంశంపై స్పందించిన కొడాలి నానిలకు తమ నిరసనను తెలియజేయడంలో పవన్ ఫ్యాన్స్ తమ సత్తా చాటారు. మరో వైపు ప్రభుత్వం కూడా ‘భీమ్లా నాయక్’ కలెక్షన్స్ ఉధృతిని ఏపీలో నిలువరించడంలో విజయవంతం అయ్యింది. ఈ పోటీతత్వం సినిమాలోని కంటెంట్ కు సరిపోల్చుకుంటున్నారా?
bomma lo mana meeda emanna satire lu unnayemo chusi rammani pampinchinattunnadu jagan anna https://t.co/Ty7SoTWd9q
— RK 🇮🇳 (@RKTwts) February 25, 2022



