సుమారు నాలుగేళ్ళ క్రితం జగన్మోహన్ రెడ్డి విజయనగరంలో పాదయాత్ర ముగించుకొని విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్ళేందుకు విమానాశ్రయంలో వేచి ఉన్నప్పుడు శ్రీనివాస్ అనే యువకుడు కోడి పందేలలో కోడి కాలుకి కత్తే కత్తితో ఆయనపై దాడి చేసి గాయపరిచాడు.
అప్పుడు అరెస్ట్ అయిన తన కొడుకుని నేటి వరకు విచారణ జరపకుండా రిమాండ్ ఖైదీగా జైలులోనే ఉంచేశారని అతని తల్లి సావిత్రి ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా తన కొడుకుని రిమాండ్ ఖైదీగా జైలులో ఉంచడం సరికాదని, కనుక దిగువ న్యాయస్థానాన్ని విచారణకు ఆదేశించి తక్షణం తన కొడుకుకి జైలు నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ సావిత్రమ్మ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఈరోజు ఓ లేఖ వ్రాశారు. నిరుపేద కుటుంబానికి చెందిన తమకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఆనాడు జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన ఆ కోడికత్తి దాడి రాష్ట్రవ్యాప్తంగా చాలా సంచలనం సృష్టించింది. దీనిపై అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిడిపికి , ప్రతిపక్షంలో ఉన్న వైసీపీల మద్య చాలా తీవ్ర స్థాయిలో పరస్పర ఆరోపణలు చేసుకొన్నాయి. టిడిపి ప్రభుత్వమే ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌మోహన్ రెడ్డిపై ఆ దాడి చేయించిందని వైసీపీ వాదించగా, ప్రజల సానుభూతి పొందేందుకు జగన్‌మోహన్ రెడ్డే తనపై తాను దాడి చేయించుకొన్నారని టిడిపి వాదించింది.
ఒకవేళ టిడిపియే జగన్మోహన్ రెడ్డి హత్యాయత్నం చేయించినట్లు వైసీపీ భావిస్తున్నట్లయితే మూడేళ్ళుగా వారి పార్టీయే అధికారంలో ఉంది కనుక ఈ కేసు విచారణను పూర్తి చేయించి శ్రీనివాస్ వెనుక ఎవరున్నారో కనుగొనడం కష్టమేమీ కాదు. కానీ కేసు విచారణ జరగడం లేదని శ్రీనివాస్ తల్లి సావిత్రమ్మ జస్టిస్ ఎన్వీ రమణకు వ్రాసిన లేఖలో స్పష్టమైంది. కనుక ఇప్పుడు జస్టిస్ ఎన్వీ రమణ జోక్యం చేసుకొంటే ఈ కేసు విచారణ మొదలవుతుంది. అప్పటి వరకు వేచి చూడాల్సిందే.



