ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే. చుట్టకు నిప్పు దొరికిందని

Revanth Reddy Konda Surekha Rajagopal Reddy Telangana Cabinet crisis

తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఊహించినట్లే రాజీనామాకు అంగీకరించలేదు. కనుక ఆమెను మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నట్లు సిఎం రేవంత్‌ రెడ్డి గవర్నర్‌ శివ్‌ ప్రతాప్ శుక్లాకు లేఖ ద్వారా తెలియజేశారు.

ఆమె ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతారో తేలికగానే ఊహించవచ్చు. కనుక ఇప్పుడు ఆ చర్చ వద్దు.

ADVERTISEMENT

ఆమెని పదవిలో నుంచి తొలగించగానే మొట్ట మొదట స్పందించినవారు ఇద్దరు. ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

వారిద్దరి మాటలు విన్నప్పుడు ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే. చుట్టకు నిప్పు దొరికిందని మరొకడు సంతోషపడ్డాడన్నట్లే ఉన్నాయి.

కేఏ పాల్ మొదట బోలెడని ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తూ చాలా ఆశ్చర్యపోయారు. షాక్ అయ్యారు. తర్వాత రెడ్లు బీసీ బిడ్డకు అన్యాయం చేశారంటూ ఆవేదన.. తర్వాత మన ప్రజాశాంతి పార్టీ ఉండగా దిగులేల?ఇదే మా ఆహ్వానం అంటూ కొండా దంపతులను తన పార్టీలోకి ఆహ్వానించారు.

అయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మొదలు ప్రధాని మోడీ, అమిత్ షాల వరకు ప్రతీ ఒక్కరితో ఫోటోలు దిగుతున్నా, అయన పరపతిని ఎవరూ గుర్తించడం లేదు. ఆయన ఆహ్వానిస్తున్నా ఎవరూ అయన పార్టీలో చేరడం లేదు. అలాగని ఆయన తలుపులు మూసుకు కూర్చోలేదు. ఇలా అవకాశం వచ్చినప్పుడల్లా పిలుస్తూనే ఉన్నారు. కొండా దంపతుల కోసం పార్టీ తలుపులు తెరిచియేయున్నవని కేఏ పాల్ తెలిపారు.

మూడేళ్ళుగా మంత్రి పదవి కోసం అల్లాడిపోతున్న మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నిన్ననే సిఎం రేవంత్‌ రెడ్డిని ఉద్దేశ్యించి “బయట నుంచి వచ్చి పార్టీని కబ్జా చేసేశారు. నావంటి నిఖార్సయిన కాంగ్రెస్‌ నాయకులను బయటకు గెంటేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్పూర్తితో రేవంత్ వంటి బయట వ్యక్తుల నుంచి కాంగ్రెస్‌ పార్టీని కాపాడుకుంటాం. ఎప్పటికైనా నేనే ముఖ్యమంత్రి పదవి చేపడతాను,” అని అన్నారు.

కానీ కొండా సురేఖని బర్త్ రఫ్ చేసినట్లు తెలియగానే మాట మార్చారు. “ఆమె చాలా తప్పులు చేశారు. కనుక కాంగ్రెస్‌ అధిష్టానంపై ఆమెపై చర్యలు తీసుకుంది. ఆమె స్థానంలో ఎవరిని నియమించాలనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. అధిష్టానం నిర్ణయానికి మనం అందరం కట్టుబడి ఉండాలి,” అన్నారు.

పదవి పోయిందని ఆమె బాధ పడుతుంటే, ఆ పదవి తనకు లభిస్తుందని రాజగోపాల్ రెడ్డి ఆశ పడుతున్నారన్న మాట. ఇదే చివరి అవకాశం కనుక ఈసారి మంత్రి పదవి ఇవ్వకపోతే రేవంత్ రెడ్డితో తాడోపేడో తేల్చేసుకోవడం ఖాయం.

కానీ రాజగోపాల్ రెడ్డి బయటకు పోతే తమకు అవకాశం దొరుకుతుందని ఆశ పడుతున్నవారు కాంగ్రెస్‌ పార్టీలో చాలా మందే ఉన్నారు. చుట్టకు నిప్పు అంటే ఇదేగా?

ADVERTISEMENT
Latest Stories