నీళ్ళ నుంచి రాజకీయాలు వేరు చేయలేకపోతే..

revanth-reddy_chandrababu-naidu

బుధవారం ఢిల్లీలో ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు, జలవనరుల శాఖల మంత్రులు, ఆ శాఖల కార్యదర్శులు, రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కేంద్ర జలాశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో సమావేశమయ్యారు.

రాష్ట్ర విభజన తర్వాత ఈ నీళ్ళ పంచాయితీ కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ‘ఎపెక్స్ కౌన్సిల్’ ఏర్పాటు చేసింది. రెండుసార్లు సమావేశమైనా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు.

ADVERTISEMENT

కనుక ఈ నీళ్ళ పంచాయితీ నిన్న జరిగిన సమావేశంతో పరిష్కారమైపోతుందని ఎవరూ ఆశించలేదు. సమస్యని పరిష్కరించలేనప్పుడు ఏ ప్రభుత్వమైనా చేసేది కమిటీ వేయడమే. కేంద్ర ప్రభుత్వం అదే చేసింది.

కేంద్ర ప్రభుత్వం, రెండు రాష్ట్రాలకు చెందిన సాగునీటి నిపుణులు, ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులతో కూడిన ఓ కమిటీ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ నెలాఖరులోగా ఈ కమిటీ ఏర్పాటయ్యే అవకాశం ఉంది.

నిన్న ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో గోదావరి బోర్డుని హైదరాబాద్‌లో కొనసాగిస్తూ కృష్ణా బోర్డుని అమరావతికి తరలించాలని నిర్ణయించారు. కృష్ణా బోర్డు ఎక్కడున్నా ఏపీకి తేడా ఉండదు. కనుక దానిని అమరావతికి తెచ్చుకున్నా అదనపు భారమే తప్ప బహుశః కొత్తగా ఒరిగేదేమీ ఉండకపోవచ్చు.

ఈ సమావేశంలో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీ నీళ్ళు వాడుకోవడంపై తీవ్ర అభ్యంతరాలు తెలిపిన తెలంగాణ ప్రభుత్వం, శ్రీశైలం ప్రాజెక్టు మరమత్తుల బాధ్యత ఏపీకి అప్పగించి చేతులు దులుపుకుంది.

ఇరు రాష్ట్రాలు కృష్ణా, గోదావరి జలాలను తీసుకువెళ్ళే కాలువల వద్ద టెలిమెట్రీల ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

కృష్ణా, గోదావరి నీళ్ళ పంపకాలు, వాడకాలపై సమస్యలను పరిష్కరించుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఈ నీళ్ళ పంపకాలను ఓ వివాదంగా మార్చి దాంతో ‘తెలంగాణ సెంటిమెంట్’ రగిలిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తుండటం వలననే ఈ సమస్య అపరిష్కృతంగా ఉంది.

దీనికి బనకచర్ల ప్రాజెక్టుపై ఆ పార్టీ చేసిన రాజకీయాలే తాజా నిదర్శనం. బనకచర్ల పేరుతో రాజకీయాలు చేస్తూ బీఆర్ఎస్‌ పార్టీ దూసుకుపోతుంటే, రాజకీయంగా తాము నష్టపోతామని కాంగ్రెస్‌ ప్రభుత్వం భావించి అది కూడా ఈ ప్రాజెక్టుపై వితండవాదం చేయక తప్పలేదు. నీళ్ళ రాజకీయాలకు ఇంత కంటే చక్కటి ఉదాహరణ ఏముంటుంది?

త్వరలో ఏర్పాటు చేయబోయే హైలెవెల్ కమిటీ ఒకవేళ ఈ నీళ్ళ సమస్యలకి పరిష్కారం కనుగొన్నా బీఆర్ఎస్‌ పార్టీ వెంటనే రంగంలో దిగి తెలంగాణకు అన్యాయం జరిగిపోతోందంటూ తప్పకుండా అడ్డుపడుతుంది.

కనుక నీళ్ళ నుంచి ఈ బీఆర్ఎస్‌ పార్టీ రాజకీయాలను వేరు చేయనంత వరకు ఎన్ని కమిటీలు వేసినా ప్రయోజనం ఉండదు. కానీ ఈ నీళ్ళలో చేపవంటి బీఆర్ఎస్‌ పార్టీని నీళ్ళ నుంచి వేరు చేస్తే అది బతకలేదు. కనుక అలాంటి ప్రయత్నాలను అది గట్టిగా ఎదుర్కొని అడ్డుపడుతూనే ఉంటుంది. కనుక ఇప్పుడు ఏర్పాటు చేయబోయే కమిటీ కూడా కేవలం కాలక్షేపానికే.

ADVERTISEMENT
Latest Stories