వైసీపీతో దోస్తీకి టిఆర్ఎస్‌ మళ్ళీ రెడీ?

KTR about YSRCP Govt Friendship                 ఈ నెల 27న టిఆర్ఎస్‌ పార్టీ 22వ ఆవిర్భావ దినోత్సవం జరుగనుంది. ఈ నేపధ్యంలో మంత్రి, ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వరుసగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. నిన్న ఓ ప్రముఖ తెలుగు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో “ఏపీలో జగన్మోహన్ రెడ్డి సిఎంగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో ఇద్దరు ముఖ్యమంత్రుల మద్య, మీ రెండు ప్రభుత్వాల మద్య చక్కటి స్నేహపూరిత వాతావరణం ఉండేది. కానీ ఆ తరువాత నీళ్ళ పంపకాలపై కీచులాడుకొని దూరం అయ్యారు? అనే ప్రశ్నకు కేటీఆర్‌ సమాధానం చెపుతూ, “ఏపీ ప్రభుత్వంతో కానీ సిఎం జగన్మోహన్ రెడ్డితో గానీ మాకు ఎటువంటి విభేధాలు లేవు. కానీ మా మద్య ఈ నీళ్ళ చిచ్చు పెట్టింది కేంద్రప్రభుత్వమే. రెండు తెలుగు రాష్ట్రాలపై పెత్తనం చలాయించడానికి కృష్ణా, గోదావరి బోర్డులు ఏర్పాటు చేసింది కానీ రెండు రాష్ట్రాలకు నీళ్ళ పంపకాలపై విభేదిస్తున్నప్పుడు, బోర్డులను గుప్పెట్లో పెట్టుకొని కూర్చోన్న కేంద్రప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయడంలేదు. నీళ్ళ కోసం రెండు రాష్ట్రాలు కీచులాడుకొంటుంటే చోద్యం చూస్తోంది. ఒకవేళ ఈ సమస్యను పరిష్కరించలేకపోతే తప్పుకోమనండి మేమే మాట్లాడుకొని సామరస్యంగా పరిష్కరించుకొంటాము. కేంద్రం పరిష్కరించదు మమ్మల్ని పరిష్కరించుకోనీయదు,” అని అన్నారు.

గత ఏడేళ్ళుగా రెండు రాష్ట్రాలు కీచులాడుకొంటూనే ఉన్నాయి కానీ మా మద్య ఎటువంటి విభేధాలు లేవని కేంద్రప్రభుత్వం కారణంగా దూరం పెరిగిందని కేటీఆర్‌ చెప్పడం విశేషం. అంటే మళ్ళీ వైసీపీతో దోస్తీకి టిఆర్ఎస్‌ సిద్దంగా ఉందని సంకేతం ఇచ్చినట్లు భావించవచ్చు. టిఆర్ఎస్‌లో ఈ అకస్మాత్తు మార్పుకి బలమైన కారణమే ఉంది.

ADVERTISEMENT

తెలంగాణ రాష్ట్రంలో నానాటికీ బిజెపి బలపడుతుండటంతో టిఆర్ఎస్‌ పార్టీ కేంద్రంపై కత్తులు దూస్తూ రాష్ట్రంలో బిజెపిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తోంది. పనిలో పనిగా సిఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించాలనుకొంటున్నారు. ఈ ప్రయత్నంలో ఇప్పటికే ఆయన కర్ణాటక, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా బిజెపిని వ్యతిరేకిస్తున్న అక్కడి పార్టీల అధినేతలతో సమావేశమయ్యి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు చర్చించారు. కానీ పొరుగునే ఉన్న ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డిని మాత్రం కలవలేదు! కలుపుకుపోవాలని ప్రయత్నించలేదు! జగన్మోహన్ రెడ్డి నిధులు, కేసులలో ఉపశమనం కోసం కేంద్రప్రభుత్వానికి విధేయంగా వ్యవహరిస్తున్నారు. కనుక ఆయన పరిస్థితి చూసి అడిగి ప్రయోజనం లేదని కలవలేదేమో?

అయితే వివిద రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలు, ప్రశాంత్ కిషోర్‌తో సుదీర్గ చర్చల తరువాత కాంగ్రెస్ పార్టీని కలుపుకోకుండా మోడీ, అమిత్ షాలను ఎదుర్కొని నిలవలేమని కేసీఆర్‌ కూడా గ్రహించినట్లే ఉన్నారు. అయినప్పటికీ కేసీఆర్‌కు కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడం ఇష్టం లేదు కనుక తన యుద్ధంలో వైసీపీని కూడా కలుపుకోగలిగితే మరింత బలం చేకూరుతుందని భావిస్తునందునే ఈ సంకేతం ఇచ్చి ఉండవచ్చు.

వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్‌, వైసీపీలకు ఎదురీత తప్పదు. కనుక ఒకరి అవసరం మరొకరికి ఉంటుంది. గత ఎన్నికలలో చంద్రబాబునాయుడుని గద్దె దించేందుకు సిఎం కేసీఆర్‌ తెర వెనుక వైసీపీకి సాయం అందించిన సంగతి అందరికీ తెలుసు. కనుక ఇప్పటి నుంచే కలిసి పనిచేస్తే మంచిదనే ఉద్దేశ్యంతో సిఎం కేసీఆర్‌ తన కుమారుడు కేటీఆర్‌ ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఈవిదంగా సంకేతం పంపించి ఉండవచ్చు. అయితే కేసీఆర్‌ స్నేహ హస్తాన్ని జగన్ అందుకొంటారా? కేసీఆర్‌ను నమ్మోకొని మోడీతో కయ్యానికి సిద్దపడతారా?రాబోయే రోజుల్లో తెలుస్తుంది.

ADVERTISEMENT
Latest Stories