కేటీఆర్‌ నిలదీయాల్సింది రేవంత్‌ రెడ్డిని కాదు… తండ్రి కేసీఆర్‌ని!

KTR-Responds-On-Telangana-State-Election-2023-Schedule

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టేశామని విర్రవీగిన కేసీఆర్‌ అదే కాంగ్రెస్‌ చేతిలో ఓడిపోవడం జీర్ణించుకోవడం కష్టమే. అయితే శస్త్ర చికిత్స చేయించుకొని ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకొంటున్నందున ఆయన గొంతుతో కేటీఆర్‌ మాట్లాడుతున్నారు.

దీని వలన ఆయన రాజకీయంగా మరింత ఎదుగుతారో లేదో తెలీదు కానీ నెలరోజులు కూడా పూర్తికాని రేవంత్‌ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ ప్రజల దృష్టిలో చులకన అవుతున్నారు. ఈ కారణంగానే బిఆర్ఎస్ పార్టీ పట్ల కూడా ప్రజలలో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని గ్రహించిన్నట్లు లేదు.

ADVERTISEMENT

కేటీఆర్‌ నిన్న మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ మూడు నెలల్లో ఆరు గ్యారెంటీలు వాటిలో హామీలన్నిటినీ అమలుచేస్తామని ప్రజలను మభ్యపెట్టి ఎన్నికలలో గెలిచింది. ఇప్పటికే ఒక నెల గడిచిపోయింది. కనుక కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మరో రెండు నెలలు మాత్రమే గడువు ఉంది. ఆలోగా అన్ని హామీలు అమలుచేయకపోతే మేము గట్టిగా నిలదీస్తాము. ప్రజలను చైతన్యపరిచి వారితో కలిసి పోరాడుతాము,” అని హెచ్చరించారు.

రాజకీయ పార్టీలు ఎన్నికలలో గెలిచేందుకు అలవి కాని వాగ్ధానాలు చేయడం చాలా తప్పే. అయితే కాంగ్రెస్‌, బిఆర్ఎస్‌ రెండు పార్టీలు అదే తప్పు చేసాయి.

బిఆర్ఎస్‌ మొదటిసారి గెలిస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. కానీ తానే ఆ పదవి చేపట్టి పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించారు. తర్వాత తన కుమారుడు కేటీఆర్‌కు పట్టాభిషేకం చేయాలనుకొన్న సంగతి తెలిసిందే.

అలాగే దళితులకి మూడెకరాల భూమి, పంట రుణాల మాఫీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, ఇంటిలో ఉద్యోగం ఇస్తామంటూ బిఆర్ఎస్‌ అనేక హామీలు గుప్పించింది. కానీ పదేళ్ళ పాలనలో వాటిలో కొన్నిటిని మాత్రమే అదీ కొంతవరకే అమలుచేసింది.

రెండోసారి అధికారంలోకి వస్తే పాత హామీలతో పాటు ఈసారి నెలకు రూ.3,016 చొప్పున యువతకు నిరుద్యోగభృతి కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ వాటినీ అమలుచేయలేదు. ఏమంటే కరోనా, లాక్‌డౌన్‌ వలన రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందని అందువల్లే నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయామని కేటీఆర్‌ సర్ధిచెప్పుకొన్నారు.

కానీ అదే సమయంలో వేలకోట్లు ఖర్చు చేసి కొత్త సచివాలయం, హైదరాబాద్‌తో సహా రాష్ట్ర వ్యాప్తంగా అనేక భారీ భవనాలు నిర్మించింది. అంటే కేసీఆర్‌ ప్రభుత్వం అబద్దం చెప్పిందని అర్దమవుతోంది. కనుక ఇప్పుడు రేవంత్‌ రెడ్డిని నిలదీస్తున్న కేటీఆర్‌ తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎందుకు అమలుచేయలేదు?అని తండ్రి కేసీఆర్‌ని నిలదీస్తే మంచిది. లేకుంటే రేపు కాంగ్రెస్‌ నేతలు ఇదే ప్రశ్నిస్తారు.

తమ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పదేళ్ళు కాలక్షేపం చేసేసిన కేటీఆర్‌, రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలరోజులు కూడా పూర్తికాక ముందే “అన్ని హామీలను అమలుచేయాల్సిందే… లేకుంటే ప్రజలు మీకు బొంద పెడతారంటూ” బెదిరించడం చూస్తే కేసీఆర్‌, కేటీఆర్‌లో ఇంకా అహంకారం తగ్గలేదనిపిస్తుంది. బిఆర్ఎస్‌లో కేటీఆర్‌ ఒక్కరే ఇలా చెలరేగిపోతే దానికికి ఆయనే మూల్యం చెల్లించాల్సి రావచ్చు.

ADVERTISEMENT
Latest Stories