విలీనం గురించి… సిఎం రమేష్ కూడా చెప్పేశారుగా!

KTR Secret BRS-BJP Merger Offer Exposed By BJP MP CM Ramesh

రాజకీయాలలో ఉన్నవారందరూ అద్దాలమేడలో కూర్చున్నట్లే. కనుక ఎన్నడూ దారిన పోయేవారిపై రాళ్ళు విసరకూడదు. కానీ కేటీఆర్‌, హరీష్ రావు ఇద్దరూ విసురుతునే ఉన్నారు.

హైదరాబాద్‌ శివారులో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలో రోడ్ కాంట్రాక్ట్ ఏపీ బీజేపి ఎంపీ సిఎం రమేష్‌కి బహుమతిగా ఇచ్చారని, ఏపీ కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తూ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు.

ADVERTISEMENT

కేటీఆర్‌కి సిఎం రమేష్ చెప్పిన జవాబు వింటే ఎవరైనా షాక్ అవుతారు. ఇంతకీ అయన ఏమన్నారంటే, “కొన్ని నెలల క్రితం మీరు (కేటీఆర్‌) దిల్లీలో నా ఇంటికి వచ్చి కల్వకుంట్ల కవితతో సహా మీ అందరిపై కేసుల విచారణ నిలిపివేస్తే బీఆర్ఎస్‌ పార్టీని బీజేపిలో విలీనం చేస్తామని చెప్పిన మాట వాస్తవమా కాదా?

విలీనం గురించి మా అధిష్టానంతో మాట్లాడి ఒప్పించాలని నన్ను రిక్వెస్ట్ చేసిన మాట నిజమా కాదా? కాదని చెప్పండి…. ఆరోజు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు సీసీ కెమెరాలలో రికార్డ్ అయిన వీడియోలు మీడియాకు విడుదల చేస్తాను.

కానీ మీ విలీనం అభ్యర్ధనని మా పార్టీ అంగీకరించలేదనే అక్కసుతోనే నా గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మా కంపెనీ కూడా ఇతర కంపెనీలతో పాటు టెండర్లు వేసి కాంట్రాక్ట్ దక్కించుకుంది. అయినా కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో సాగునీటి ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ పనులు ఆంధ్రా కాంట్రాక్టర్లకే ఇచ్చారుగా? ఆ వివరాలు కూడా చెప్పమంటే చెప్తాను.

మీకు పదవి అధికారం చేతికి దక్కగానే అందరినీ మరిచిపోయారు. కానీ సిఎం రేవంత్ రెడ్డితో స్నేహం ఈనాటిది కాదు. ఇద్దరం టీడీపిలో ఉన్నప్పటి నుంచి ఉంది. స్నేహం ఉన్నంత మాత్రాన్న ఏ ముఖ్యమంత్రి కాంట్రాక్టులు తనకు నచ్చినవారికి కట్టబెట్టలేరు. కానీ కేసీఆర్‌ ఆవిధంగా కట్టబెట్టారా?అని ఇప్పుడు నాకు సందేహం కలుగుతోంది.

మీరు మంత్రిగా ఉన్నప్పుడు అమెరికా, మాల్దీవులు ఎందుకు వెళ్ళారో, ఎలా వెళ్ళారో నాకు తెలుసు. ఆ వివరాలు సీబీఐ, ఈడీలకు ఇస్తే మీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించండి,” అని సిఎం రమేష్ ఘాటుగా బదులిచ్చారు.

“బీఆర్ఎస్‌ పార్టీని బీజేపిలో విలీనం గురించి కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత రెండు మూడు నెలల క్రితం బయటపెట్టారు. ఇప్పుడు సిఎం రమేష్ కూడా అదే చెపుతున్నారు. కనుక బీఆర్ఎస్‌ పార్టీని బీజేపిలో విలీనం చేయడానికి కేసీఆర్‌, కేటీఆర్‌ సిద్దపడ్డారని స్పష్టమవుతోంది.

ఇటీవల కేటీఆర్‌ అర్దరాత్రి రహస్యంగా హైదరాబాద్‌లో ఏపీ మంత్రి నారా లోకేష్‌ ఇంటికి వెళ్ళి కలిశారని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే.

కనుక బీఆర్ఎస్‌ పార్టీ విలీనం కోసం నారా లోకేష్‌ని సంప్రదించారా?లేదా తెలంగాణలో ఓ వైపు కాంగ్రెస్‌ పార్టీ, మరోవైపు బీజేపి, టీడీపి, జనసేనలు కలిసి పోటీ చేస్తే బీఆర్ఎస్‌ పార్టీ అడ్రస్ లేకుండా పోతుందని భయపడి తరుణోపాయం కొరకు నారా లోకేష్‌ని కలిశారా? అనేది ప్రశ్నకు నారా లోకేష్‌ మాత్రమే సమాధానం చెప్పగలరు.

ఈ భేటీ గురించి కేటీఆర్‌ చెప్పాల్సింది చెప్పేశారు కనుక నారా లోకేష్‌ కూడా సిఎం రమేష్‌లాగ చెప్పేస్తే బీఆర్ఎస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు విని సంతోషిస్తారు కదా? ఈ మాటలు, విమర్శలు, రహస్య భేటీలు చూస్తే బీఆర్ఎస్‌ పార్టీ పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని, కానీ కేటీఆర్‌, హరీష్ రావు ఇద్దరూ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారనిపిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories