కర్నూలు జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బరిలో తెదేపా అభ్యర్థి కేఈ ప్రభాకర్ ఒక్కరే మిగలడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఓటమి దాదాపుగా ఖరారు కావడంతో వైకాపా ఈ ఎన్నికలో అభ్యర్థిని కూడా నిలబెట్టలేదు.
అయితే బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థులకు మద్దత్తు ఇచ్చి టీడీపీని ఇరుకున పెడదామని ఒకదశలో ఆ పార్టీ ప్రయత్నించింది. అయితే అధికారపక్షం బరిలోకి దిగి వారితో విరమింపచేసింది. టీడీపీ చేతిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ అవ్వనివ్వకుండా, తమ పార్టీ ఎంపీలు, జడ్పీటీసీలు ఎక్కువగా ఉన్నప్పటికీ పోటీ చేయడంలేదని వైసీపీ స్పష్టం చేసింది.
శిల్పా చక్రపాణి రెడ్డి రాజీనామాతో ఈ సీట్ ఖాళీ అయ్యింది. నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా తన అన్నకు మద్దతుగా రాజీనామా చేసి వైకాపాలో జాయిన్ అయ్యారు శిల్పా చక్రపాణి రెడ్డి. అయితే ఓటమి తథ్యం కావడంతో ఉపఎన్నికలో పోటీ చెయ్యడానికి కూడా నిరాకరించారు ఆయన.



