
నేటి సమకాలీన రాజకీయ పరిస్థితులు గమనిస్తుంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో భావోద్వేగంతో ఆయా రాష్ట్ర ప్రజలను తమ రాజకీయ వ్యూహంలోకి తీసుకు వస్తున్నారు అక్కడి రాజకీయ పార్టీలు, అందుకు సంబంధించిన రాజకీయ నాయకులు.
ఉదాహరణకు ఏపీకి పొరుగు రాష్ట్రమైన తమిళనాడు తీసుకుంటే ఇక్కడ తమ మాతృభాష పై ఉత్తరాది ఆధిపత్యం అవసరమా అంటూ తరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు తమిళ రాజకీయ పార్టీలు. ఎప్పటికప్పుడు ఇక్కడి ప్రజల భావోద్వేగాలతో తమ రాజకీయ లబ్ది కోసం మంటలు రేపుతూనే ఉంటారు ఇక్కడి నాయకులు.
Also Read – అందగాడికే ఇన్ని కష్టాలు…!
జల్లికట్టు అంశం నుంచి త్రిభాష విధానం వరకు తమ హక్కులను కేంద్ర హరించేస్తుంది అంటూ గగ్గోలు పెట్టి మరి అన్ని రాజకీయ పార్టీలు ఒక్కతాటి మీదకు వచ్చి మరి ఢిల్లీ పీఠం పై దండెత్తుతాయి. ఇలా తమిళనాట “భాషోద్వేగాన్ని” రెచ్చకొడుతూ ఇప్పటి వరకు రెండు ప్రాంతీయ పార్టీలు రాజ్యమేలుతున్నాయి.
ఇక మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ రాజకీయ పార్టీల ఏకైక రాజకీయ అస్త్రం “ప్రాంతీయవాదం”. తెలంగాణ, ఆంధ్ర అంటూ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ విమర్శలు చేస్తూ ఇక్కడ పార్టీలు ముఖ్యంగా బిఆర్ఎస్ గా మారిన తెరాస ప్రజల భావోద్వేగాల చుట్టూ చలికాచుకుంటుంది.
Also Read – టీటీడీ నోటీసులతో వైసీపీ గురువు ఇబ్బంది
తన పార్టీ అస్తిత్వానికి ఎప్పుడు ముప్పు వాటిల్లినా, బిఆర్ఎస్ ఉనికి ఎక్కడ హరించుకుపోయినా ఆ పార్టీ అధినేత ప్రధమ ఏజెండా ఆంధ్రా మీద విషం కక్కడమే, ఆంధ్రా నాయకుల మీద విమర్శలు ఎక్కుపెట్టడమే. ఆంధ్రప్రదేశ్ కు ఇరుగు, పొరుగు రాష్ట్రాలుగా ఉన్న తమిళనాడు, తెలంగాణ ఇలా ఒకరు భాషోద్వేగంతో ప్రజలను రెచ్చకొడుతుంటే, మరొకరు ప్రాంతీయవాదం తో ఓటర్లను తమ వైపు తిప్పుకుంటున్నారు.
మరి ఏపీలో ఏ భావోద్వేగం తో రాజకీయ పార్టీల మధ్య రాజకీయం నడుస్తుంది అంటే యిట్టె చెప్పడం చాల కష్టతరం. ఇక్కడ సానుభూతి అనే అస్త్రం మాత్రం రాజకీయ నాయకులకు వరంలా కనిపిస్తుంది. ఆ వరంతోనే ఒక్క ఛాన్స్ అంటూ ఐదేళ్ల అధికారాన్ని అందుకున్న నాయకులు ఏపీ లో రాజ్యమేలిన విషయం తెలిసిందే. అయితే 2024 ఎన్నికల తీరుని ఒక్కసారి గమనిస్తే ఇక్కడి ప్రజలలో కూడా అంతర్లీనంగా ఒక ఎమోషన్ కనిపిస్తుంది.
“ఇది మన రాష్ట్రం, ఇది మన రాజధాని” అనే ఒకే ఒక్క ఎమోషన్ గత ఎన్నికలలో సప్త సముద్రాల వెనుక ఉన్నవారిని కూడా ఏపీకి తీసుకువచ్చింది, ఎన్నికలలో ఓటు వేసేలా చేసింది. ఎన్నడూలేని విధంగా 2024 ఎన్నికలలో ఏపీ నుండి వలస బాట పట్టిన ప్రజలంతా తమ రాష్ట్ర అభివృద్ధిని కాక్షించి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. దాని ఫలితమే ఏపీలో ప్రతిపక్షం లేని ప్రభుత్వం.
ఏపీ ప్రజలలో వచ్చిన ఈ భావోద్వేగం ఏ రాజకీయ పార్టీ కృత్రిమంగా సృష్టించింది కాదు. ఏ రాజకీయ నాయకుడి కల్పిత గాథా కాదు. ప్రజలలో స్వచ్ఛందంగా పుట్టిన ఈ భావోద్వేగాన్ని కూటమి పార్టీలు చక్కగా ఒడిసిపట్టుకుని 164 సీట్లతో మునుపెన్నడూ లేని విధంగా ప్రభుతావన్ని ఏర్పాటు చేయగలిగింది. దీనితో ఏపీ ప్రజల ఎమోషన్ ఉద్యమాలలో కనిపించదు, పోరాటాలతో వినిపించదు అనేలా చేసి చూపించారు.