ఎల్‌కె అద్వానీకి భారతరత్న! పురస్కారమా… ఎన్నికల కోసమా?

Narendra-modi-LK-Advani

మాజీ ఉపప్రధాని, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ (96)కి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న అవార్డు ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా ఈవిషయం ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు.

ADVERTISEMENT

“శ్రీ లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న అవార్డు ఇస్తున్నట్లు తెలియజేసేందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నేను ఆయనతో మాట్లాడి ఈవిషయం తెలియజేసి అభినందించాను…” అంటూ అద్వానీని ప్రశంసలతో ముంచెత్తారు.

అయోధ్య రామ మందిరం కోసం ఆనాడే రధయాత్ర చేసి దేశరాజకీయాలను మలుపు తిప్పి దేశంలో బీజేపీకి బలమైన పునాది వేశారు. కనుక అద్వానీని ప్రధాని నరేంద్రమోడీ ఈ అత్యున్నత పురస్కారంతో గౌరవించాలనుకోవడం చాలా అభినందనీయమే.

అయోధ్యాలోని బాబ్రీ మసీదు కూల్చివేత (1992, డిసెంబర్‌ 6) విషయంలో న్యాయస్థానం అద్వానీకి క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ, కూల్చివేతకు ఆయనే కారకుడని దేశంలో కోట్లాది మంది ముస్లింలు నేటికీ నమ్ముతున్నారు. కనుక ఆయనకు ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డును ఇవ్వడంపై రేపటి నుంచి వచ్చే విమర్శలను అందరూ చూడబోతున్నారు.

మరో విషయం ఏమిటంటే, 2014 సార్వత్రిక ఎన్నికలప్పుడు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీని బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించింది. ఆ ప్రతిపాదనను మొట్టమొదట వ్యతిరేకించిన వారిలో అద్వానీ కూడా ఒకరు! కానీ నరేంద్రమోడీ బీజేపీలోకి దూసుకువచ్చేసి పార్టీని గెలిపించుకోవడమే కాకుండా ప్రధాని కూడా అయ్యారు. ఆ తర్వాత బీజేపీలో అద్వానీ వంటి సీనియర్లందరినీ మోడీ కట్టకట్టి పక్కన పెట్టేశారు! కొత్త నీరు వస్తే పాత నీరు పక్కకు వెళ్లిపోక తప్పదు కనుక ఇది సహజమనే సరిపెట్టుకోవచ్చు.

కానీ ఆనాడు అద్వానీతో సహా సీనియర్లందరూ దీనిని చాలా అవమానంగానే భావించారు. కానీ అందరూ చాలా సంయమనం పాటించడంతో నరేంద్రమోడీ ప్రభుత్వం సజావుగా సాగి నిలద్రొక్కుకోగలిగింది. మళ్ళీ రెండోసారి కూడా నరేంద్రమోడీ ప్రధాని కాగలిగారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కూడా ప్రధాని అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

కానీ సార్వత్రిక ఎన్నికలకు ముందు అద్వానీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు ఇవ్వడం వెనుక రాజకీయ కోణం, రాజకీయ ఆలోచన కూడా ఉన్నట్లే కనిపిస్తోంది.

అద్వానీని దేశంలో ముస్లింలు ఎంతగా ద్వేషిస్తున్నప్పటికీ, అయోధ్య రామ మందిరం నిర్మాణానికి ఆయనే మార్గం సుగమం చేశారనేది వాస్తవం. అద్వానీ పూర్తిచేయలేకపోయిన అయోధ్య రామ మందిరాన్ని ప్రధాని నరేంద్రమోడీ నిర్మించి ప్రారంభించారు కూడా. కనుక ఇప్పుడు ఆ క్రెడిట్‌ అద్వానీతో పంచుకుంటే నరేంద్ర మోడీకి లాభమే తప్ప నష్టం ఉండదు.

దేశంలో హిందువులు, ముఖ్యంగా ఉత్తరాది ప్రజలు ‘అద్వానీ-మోడీ- అయోధ్య రామ మందిరం’ మూడింటినీ కలిపి చూస్తారు. త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో వారు బీజేపీకి ఓట్ల వర్షం కురిపించడం ఖాయం. కనుక లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశంలో హిందూ ఓటర్లను, ముఖ్యంగా ఉత్తరాది ప్రజలను ఆకట్టుకోవాలనే ఆలోచన కూడా ఉన్నట్లు కనబడుతోంది.

ప్రస్తుతం, కాంగ్రెస్‌, ఇండియా కూటమి బీజేపీని ఢీకొని ఓడించగల పరిస్థితిలో లేవు. కనుక బీజేపీ విజయం తధ్యమే. కానీ పదేళ్ళ పాలన తర్వాత సహజంగానే దేశ ప్రజలలో ప్రభుత్వం పట్ల కొంత అసంతృప్తి ఉంటుంది. ప్రధాని నరేంద్రమోడీ దానిని కూడా పరిగణనలోకి తీసుకొని అధిగమించేందుకే, బహుశః ఈ భారతరత్న అస్త్రాన్ని కూడా ప్రయోగించి ఉండవచ్చు. ఈ వాదనతో చాలా మంది ఏకీభవించకపోవచ్చు కానీ రేపటి నుంచి ప్రతిపక్షాలు కూడా ఇదే అభిప్రాయాలు వ్యక్తం చేయడం ఖాయమే.

ADVERTISEMENT
Latest Stories