లోకేష్ -కేటీఆర్…రహస్య భేటీ.?

Lokesh-KTR Secret Meeting Sparks Buzz

తెలంగాణ రాజకీయాలతో పాటు ఏపీ రాజకీయాలను కూడా తీవ్రంగా ప్రభావితం చెయ్యగలిగిన ఒక రాజకీయ ఆరోపణను తెలంగాణ పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి తెరమీదకు తెచ్చారు.

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను రహస్యంగా కలుసుకున్నారని, తెలంగాణలో త్వరలో రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసమే ఈ రహస్య భేటీ జరిగిందంటూ సామ ఆరోపిస్తున్నారు. తన ఈ ఆరోపణను కేటీఆర్ ఖండిస్తే పూర్తి వివరాలు బయటపెడతానంటూ కేటీఆర్ కు సవాల్ విసిరారు సామ.

ADVERTISEMENT

అయితే ఈ ఆరోపణలలో వాస్తవం ఎంత అనేది పరిశీలిస్తే, బిఆర్ఎస్ తన ఉనికిని నిలబెట్టుకోవడానికి, తెలంగాణలో తన పార్టీ పట్టు పెంచుకోవడానికి టీడీపీ టార్గెటెడ్ గా విమర్శలు గుప్పిస్తుంది. తాజాగా బనకచర్ల ప్రాజెక్ట్ తో బిఆర్ఎస్ నేరుగా టీడీపీ, ముఖ్యమంత్రి బాబు ని టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున రాజకీయ విమర్శలకు తెగబడుతుంది.

తెలంగాణలో బాబు బినామీ పాలన జరుగుతుందని, ఆయన బినామీ మనుషుల ద్వారానే తెలంగాణ ప్రజల నీటి హక్కుల దోపిడీకి ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందంటూ బిఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. అలాగే అటు ఏపీలో టీడీపీ ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీ బిఆర్ఎస్ కు తెరచాటు మిత్రపక్షంగా కొనసాగుతుంది.

ఇటువంటి సమయంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ టీడీపీ నాయకుడు లోకేష్ ను కలిసే అవకాశాలు ఉంటాయా.? ఉంటే అవి కార్యరూపంలోకి అమలవుతాయా.? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడ ఈ ఆరోపణకు బలం చేకూర్చే మరో అంశం లేకపోలేదు.

తెలంగాణలో కూడా బీజేపీ ఏపీలో మాదిరి కూటమితో ముందుకెళితే ఆ కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) లోకి కవిత ఆరోపిస్తన్నటుగా బిఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది. దీనితో ఈ రెండు పార్టీల మధ్య కాస్త సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది.

అలాగే జూబ్లీహిల్స్ వంటి కీలక ప్రాంతంలో ఏపీ సెటిలర్స్ ప్రభావం పెద్ద ఎత్తున ఉంటుంది. అలాగే ఆ ప్రాంతంలో టీడీపీ మద్దతుదారుల సంఖ్య కూడా గణనీయంగా ఉంటుంది.

2023 ఎన్నికల ఫలితాలతో ఓడలు బండ్లు..బండ్లు ఓడలు అవ్వడంతో వీరి పాత్ర చాల కీలంగా మారినామాట వాస్తవం. ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని బిఆర్ఎస్ తన భవిష్యత్ ప్రణాళికలు రచిస్తుందా.? లేక కాంగ్రెస్ నాయకుడు చేస్తున్న ఆరోపణలన్నీ వట్టి రాజకీయ ఉహాగానాలేనా.?

అయితే కాంగ్రెస్ నేత సామ చేసిన ఈ ఆరోపణ పై అటు తెలంగాణలో బిఆర్ఎస్ నుండి కానీ ఇటు ఏపీలో టీడీపీ నుండి కానీ ఎటువంటి స్పందన కనిపించలేదు. కానీ రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు అనేది మాత్రం ముమ్మాటికీ వాస్తవం.

ADVERTISEMENT
Latest Stories