ప్రస్తుతం సినీ పరిశ్రమ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందని చెప్పడానికి నేను భయపడనన్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. అలాగే మూవీ రివ్యూలతో సినిమాలు దెబ్బ తిన్తున్నాయని ఒకరు, టికెట్స్ ధర పెంచకాపోతే నష్టమని ఒకరు, పెంచితేనే నష్టమని మరొకరు రకరకాల వాదనలు వినిపిస్తుంటారు.
తాజాగా టాలీవుడ్ నిర్మాతలకి, తెలంగాణ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ యజమానులకి మద్య టికెట్స్ ఆదాయం పంచుకునే విషయంలో ఏర్పడిన వివాదంపై సినీ పరిశ్రమతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరూ మీడియా ముందుకు వచ్చి తమ తమ అభిప్రాయాలు లేదా వాదనలు వినిపించారు.
ప్రజలకు ఓ అందమైన రంగుల ప్రపంచం చూపించే సినీ పరిశ్రమలో ఇన్ని సమస్యలు, ఇన్ని గొడవలు, ఇన్ని కష్టాలు ఉన్నాయా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
నిజానికి ప్రతీ రంగంలో రకరకాల సమస్యలు ఉంటాయి. కానీ సినీ పరిశ్రమపై అందరి దృష్టి ఉంటుంది. కనుక వారు మాట్లాడే ప్రతీ మాట భూతద్దంలో నుంచి చూసినట్లు చాలా పెద్దదిగా కనబడుతుంది. ఆ ప్రభావం సినిమాలపైనే పడుతుంటుంది.
కనుక సినీ పరిశ్రమలో ఉన్నవారు సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. కానీ సినీ ఫంక్షన్స్‌లో లేదా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేస్తుంటారు. అది మనవ సహజమే కావచ్చు. కానీ ఆవిధంగా ఎవరికి తోచినట్లు వారు బహిరంగంగా మాట్లాడేస్తుంటే సమస్య మరింత జటిలంగా మారుతుందే తప్ప పరిష్కారం కాదు కదా?
ఈ పరిణామాలన్నీ చూస్తున్న దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ఆలోచింపజేస్తుంది. దాని సారాంశం ఏమిటంటే, సినిమా ఒక అద్భుతమైన మీడియా. దానిని మన బాధలకు వేదికగా మార్చడం సరికాదు. ప్రతీ రంగంలోను సమస్యలు, ఒత్తిళ్ళు, పోటీ తప్పక ఉంటాయి.
అందుకు సినీ పరిశ్రమ అతీతం కాదు. మన సమస్యలు సినిమాలపై రుద్దుతుంటే మనమే నష్టపోతాము. కనుక వాటి గురించి వేదికలపై నలుగురికి చెప్పుకోవడం కంటే సినిమాలు తీయడం మానుకుంటే మంచిది. లేకుంటే ప్రజల దృష్టిలో మనమే పలుచనవుతామన్నారు.
అందరూ కష్టాలు, నష్టాల జాబితాలు వల్లెవేస్తుంటే మధుర శ్రీధర్ రెడ్డి ఈవిధంగా చెప్పడం చాలా మందికి నచ్చకపోవచ్చు. కానీ అయన చెప్పింది వాస్తవమే కదా?
నాడు మూకీ సినిమాలు, బ్లాక్ వైట్ నుంచి నేడు డిజిటల్, గ్రాఫిక్స్, ఏఐ సాంకేతికత వరకు వచ్చేశాము. నాడు టూరింగ్ టాకీసుల నుంచి నేడు మల్టీ ప్లెక్స్ వరకు వచ్చేశాము.
కనుక కాలంతో వచ్చే మార్పులను వాడేసుకుని వాటి ప్రయోజనాలు పొందుతునప్పుడు వాటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా భరించక తప్పదు కదా?
ఇవన్నీ భరించలేమనుకున్న కొందరు దర్శక నిర్మాతలు మెల్లగా సైడ్ అయిపోయారు. ఇప్పుడు ప్రశాంతంగా జీవిస్తున్నామని చెప్పారు. మధుర శ్రీధర్ రెడ్డి కూడా అదే చెప్తున్నారు కదా?




