ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితులలో ఒకరని ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా అప్రూవరుగా మారిపోయారు. ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు, అరబిందో ఫార్మా అధినేత శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ రెడ్డి ఇద్దరూ అప్రూవర్లుగా మారి బెయిల్‌పై బయకు వచ్చారు.
ఇప్పుడు ఈ కేసులో ప్రధానసూత్రధారిగా పేర్కొనడుతున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా అప్రూవరుగా మారిపోవడంతో ఈ కేసు విచారణలో ఇంతకాలం బయటపడని అనేక రహస్యాలు బయటకు వస్తాయి. వస్తే ఏమవుతుంది?అంటే ఈ కేసులో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబందించి కొత్త విషయాలు బయటపడతాయి. అంటే ఈ కేసులో పలువురు అప్రూవర్లుగా మార్చడం ద్వారా ఆమె చుట్టూ ఉచ్చు బిగించేందుకు ఈడీ ప్రయత్నిస్తోందన్న మాట!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో కేంద్రం జోక్యం చేసుకోవడం లేదని పైకి చెప్పుకొంటున్నప్పటికీ, ఈ కేసుతోనే అది తెలంగాణ సిఎం కేసీఆర్‌ను, బిఆర్ఎస్ పార్టీని నియంత్రించాలని ప్రయత్నిస్తోందనేది బహిరంగ రహస్యం. త్వరలోనే తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈసారి ఎన్నికలలో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బిజెపి చాలా పట్టుదలగా ఉంది. కనుక జమ్మిచెట్టు మీద దాచి ఉంచిన ఈ అస్త్రాన్ని కూడా తీసి కేసీఆర్ మీద ప్రయోగించబోతోందని అనుకోవచ్చు.
అయితే ఈడీ ఏవో నాలుగు ముక్కలు చెప్పి కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేస్తే కేసీఆర్ దానిని అనుకూలంగా మార్చుకొని ఎన్నికలలో సానుభూతి సంపాదించి బిఆర్ఎస్ పార్టీని మళ్ళీ గెలిపించుకొని అధికారంలోకి వచ్చేస్తారని బిజెపి పెద్దలకు కూడా తెలుసు. అందుకే కేసీఆర్‌కు ఆ అవకాశం లేకుండా చేసేందుకే పక్కా సాక్ష్యాధారాలతో ఆయన కుమార్తెను అరెస్ట్ చేసి, తెలంగాణ ప్రజల ముందు ఆమెను, కేసీఆర్‌ను కూడా దోషిగా నిలబెట్టి, బిజెపిని గెలిపించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుంది.
బహుశః అదే సమయంలో బిఆర్ఎస్‌లో మిగిలిన నేతల అక్రమాలను కూడా బయటపెట్టి అందరూ అవినీతికి పాల్పడుతున్నారని నిరూపించేందుకు ప్రయత్నించవచ్చు. ఈ ఎత్తుగడలన్నీ సిఎం కేసీఆర్ ఊహించగలరు. కనుక వీటికి విరుగుడుగా ఆయనేమి చేయబోతున్నారనేది చాలా ఆసక్తికరం.



