‘అభయ’ ఘటనలో మమత ‘అభయ’మెవ్వరికి..?

West Bengal Chief Minister Mamata Banerjee

కోల్కోత్త ట్రైనీ డాక్టర్ హత్య ఘటనతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దోషులకు ఖచ్చితంగా సత్వర శిక్ష పడాలి అంటూ అభయ కు మద్దతుగా దేశం మొత్తం రోడ్డెక్కింది. సమాజం తలదించుకునే సంఘటన, మానవత్వం చచ్చిపోయిందా అన్నంతలా హృదయాన్ని కలిచివేసిన ఘటనకు సాక్షిగా నిలిచిన ఆర్జికర్ ఆసుపత్రి భాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

ADVERTISEMENT

ముఖ్యంగా ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ గోష్ పై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఒక ట్రైనీ డాక్టర్ పై ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వాళ్ళను పట్టుకుని చట్ట బద్దంగా శిక్షించాల్సిన ప్రభుత్వం పెద్దలే రోడ్ల మీదకు వచ్చి ర్యాలీలు చేసి చేతులు దులుపు కుంటున్నారు అంటూ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై విమర్శల దాడి పెరుగుతుంది.

దానికి తోడు బాధితులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వపెద్దలు తమ చర్యలతో ఈ విమర్శలకు ఇంకాస్త బలం చేకూరుస్తున్నారు. తన ఆధ్వర్యంలో ఉన్న ప్రదేశంలో జరిగిన ఘటనకు బాధ్యత తీసుకోవాల్సిన ప్రిన్సిపల్ సందీప్ గోష్ తన పదవికి రాజీనామా చేసి సైలెంట్ గా సైడ్ అయ్యి మరో ప్రభుత్వ ఆసుపత్రికి పిన్సిపల్ గా బాధ్యతలు తీసుకున్నారు. తీసుకున్నారు అనడం కంటే ప్రభుత్వం ఇచ్చింది అనడం సమంజసం.

బాధితులకు తక్షణ న్యాయం చెయ్యలేని మమత ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కుంటున్న సందీప్ కు మాత్రం సత్వర పోస్టింగ్ ఇప్పించి ఈ కేసులో తన అభయం ఎవరికీ అనేది చెప్పకనే చెప్పారా? అనే ప్రశ్నకు జవాబు దొరకాలి. దేశ వ్యాప్తంగా మమత పై ఈ ఆరోపణలు ఇలా కొనసాగుతున్న తరుణంలో మమతను ఇరుకున పెట్టె మరో విషయం బయటకొచ్చింది.

గతం నుంచే మమతకు, అర్జీకేర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ గోష్ కు మధ్య మంచి స్నేహ పూర్వక సంబంధాలు కొనసాగాయనే విషయాన్ని ధృవీకరించేలా ఒక లెటర్ ప్రత్యక్షమయింది. గతంలోనూ ముఖ్యమంత్రిగా ఉన్న మమత సందీప్ గోష్ పుట్టిన రోజుకు శుభాకాంక్షలు తెలియచేస్తూ రాసిన ఒక లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

దీనితో మానవత్వం మరిచిన మనిషిని కాపాడేందుకు మమత తన అధికారాన్ని అడ్డుపెడుతున్నారా అంటూ ఆమె పై విమర్శలు పెరుగుతున్నాయి. ఒక మహిళ గా ఉన్న మీరు కూడా మరో మహిళ పట్ల జరిగిన దాష్టికానికి న్యాయం చెయ్యలేక పోగా ఆరోపణలు ఎదుర్కుంటున్న వారికీ సాయం చేసున్నారా అంటూ మమత పై తీవ్రంగా మండిపడుతున్నారు.

ఈ కేసు సిబిఐ చేతికి చేరడంతో సందీప్ గోష్ కనీసం విచారణ నైనా ఎదుర్కొన్నారు లేకుంటే మమత ప్రభుత్వం ఆయనను ఈ కేసు నుండి పూర్తిగా తప్పించి ఉండేది అంటూ మమత ప్రభుత్వం పై సభ్య సమాజం భగ్గుమంటుంది. రోజుకో ట్విస్ట్ తో అసలు ఈ కేసులో బాధితురాలిగా ఉన్న అభయకు న్యాయం జరుగుతుందా వారి కుటుంబానికి మానసిక శాంతి దొరుకుతుందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి.

నేరం నేనే చేశాను, నన్ను ఎం చేసుకుంటారో చేసుకోండి, అరెస్టు చేస్తారా, ఉరి తీస్తారా అంటూ నేరాన్ని ఒప్పుకున్న నిందితుడు సంజయ్ రాయ్ నేడు సిబిఐ కోర్టులో ప్లేట్ ఫిరాయించారు. పాలీగ్రాఫ్ టెస్టుకు మీరెందుకు సమ్మతిచ్చారని మేజిస్ట్రేట్ ప్రశ్నించగా నేను అమాయకుడినని, తానూ ఏ నేరము చెయ్యలేదని, తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించడానికి చూస్తున్నారని ఈ టెస్ట్ తో అసలు విషయాలు బయటకొస్తాయని ఒప్పుకున్నట్లు న్యాయమూర్తి ముందు భావోద్వేగానికి గురయ్యారు సంజయ్.

దీనితో ఈ కేసు మళ్ళీ మొదటికొచ్చినట్లయ్యింది. సంఘటన జరిగిన గదిలో నిరసనల రూపంలో ఆధారాలు మాయమయ్యాయి, ఘటనకు బాధ్యత వహించాల్సిన పెద్ద మనుషులు రాజీనామా తో పక్కకెళ్లారు, నేరం చేసింది నేనే అంటూ ఒప్పుకున్న నిందితుడు నాకు సంబంధం లేదు అని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, న్యాయం చెయ్యవలసిన ప్రభుత్వం ఎవరికీ సాయం చేస్తుందో తెలియని పరిస్థితి. ఇక అభయ అనుభవించిన నరకానికి న్యాయం దక్కేనా.?

ADVERTISEMENT
Latest Stories