మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న “ఒక్కడు మిగిలాడు” సినిమా ఈ నెల 10వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. మనోజ్ డ్యూయల్ రోల్ చేసిన ఈ సినిమా విజయం మంచు వారబ్బాయి కెరీర్ కు చాలా కీలకమనే చెప్పాలి. వరుస పరాజయాలు చవిచూస్తున్న నేపధ్యంలో… ‘ఒక్కడు మిగిలాడు’పైనే అన్ని ఆశలు పెట్టుకున్నాడు.
ఓ పక్కన ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూనే, మరో పక్కన రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ “రంగస్థలం” సినిమాకు సంబంధించిన కీలకమైన అప్ డేట్ ను పోస్ట్ చేసారు. బహుశా ఇది కూడా ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా ప్రమోషన్స్ లో భాగమో లేక నిజంగానే చెర్రీ సినిమా పాటలు అంతగా నచ్చాసాయేమో గానీ, ‘రంగస్థలం’పై చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.
“రామ్ చరణ్ తనకు ‘రంగస్థలం’ పాటలు వినిపించారని, అప్పటినుండి అవే పాటలు తనకు గుర్తుకు వస్తున్నాయని, ఈ సినిమా ఆడియో అండ్ వీడియో విడుదల కోసం వేచిచూడలేనని, త్వరలోనే విడుదల అవుతుందంటూ” చేసిన ట్వీట్ తో మెగా ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. ఈ ట్వీట్ ప్రభావంతో ‘ఒక్కడు మిగిలాడు’ సినిమాకు మెగా అభిమానుల అండదండలు పుష్కలంగా ఉంటాయేమో చూడాలి.


