కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ, అగ్గిపుల్ల కాదేదీ కవితకనర్హం అని శ్రీశ్రీ ఏనాడో చెప్పారు. అది నిజమని వైసీపీ అధినేత జగన్ నిరూపిస్తూనే ఉన్నారు.
ఇటీవల చనిపోయినవాళ్ళని, ఎప్పుడో ఏడాది క్రితం చనిపోయినవాళ్ళ పేరుతో శవరాజకీయాలు చేయవచ్చని జగన్ నిరూపిస్తున్నారు.
రౌడీలంటే సామాన్య ప్రజలు భయపడతారు. కానీ జగన్‌కు ఆ భయం లేదు. పైగా వారే తనకు బలమనుకుంటారు. అందుకే మరిచిపోకుండా పనిగట్టుకొని వాళ్ళనీ పరామర్శిస్తుంటారు.
ఎప్పుడో 5-6 ఏళ్ళ క్రితం అక్రమాస్తుల కేసులో 16 నెలలు జగన్ జైల్లో ఉన్నారు. కనుక జైల్లోకి వెళ్ళేందుకు కూడా జగన్ జంకరు. జైల్లో ఉన్న పార్టీ నేతలని పరామర్శించే మిషతో తరచూ జైల్లోపలకి వెళ్ళి వస్తుంటారు.
యాత్ర పేరు ఏదైనా, సాకు ఏదైనా దాంతో బలప్రదర్శన చేయవచ్చని జగన్ ఇతర పార్టీల నేతలకి, ఇరుగు పొరుగు రాష్ట్రాలలో పార్టీల నేతలకీ కొత్త రకం రాజకీయాలు నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు.
పొదిలి పర్యటనలో వైసీపీ శ్రేణులు మహిళలు, పోలీసులపై రాళ్ళు వేస్తే, పల్నాడు పర్యటనలో అడ్డొస్తే నిర్ధాక్షిణ్యంగా తొక్కుకుపోతామే తప్ప ఆగేదేలే అన్నారు. రప్పా రప్పా తలకాయలు నరికించేస్తామని ఫ్లెక్సీ బ్యానర్స్ సాక్షిగా హెచ్చరించారు.
ఇక బంగారుపాళ్యం పర్యటనని ‘తోతాపురి’ (కలెక్టర్ మామిడి కాయలు)తో కూడా రాజకీయాలు చేయవచ్చని జగన్ నిరూపించి చూపారు.
మామిడి రైతులకు నష్టం వస్తే వచ్చి పలకరించకూడదా?అంటూ సోషల్ మీడియాలో పెద్ద లేఖ పోస్ట్ చేశారు జగన్. కానీ తన డ్రామాని రక్తికట్టించేందుకు జిల్లాకు చెందిన వైసీపీ నేతలు స్థానిక మామిడి రైతులని భయపెట్టి, బెదిరించి వారి తోటల్లో నుంచి బలవంతంగా తోతాపురి కాయలను ట్రాక్టర్లలో తీసుకువచ్చి రోడ్లపై పారబోసి ట్రాక్టర్లతో తొక్కిస్తే మామిడి రైతుకు నష్టం కలిగిందని జగన్ భావించలేదు.
ఇదెలా ఉందంటే.. రెంటపాళ్ళలో ఏడాదిన్నర క్రితం చనిపోయిన వైసీపీ కార్యకర్త కుటుంబానికి పరామార్చించడానికి వెళుతూ, దారిలో సింగయ్య అనే మరో కార్యకర్తని బలి తీసుకున్నట్లే ఉంది!
జగన్ వారం వారం కూటమి ప్రభుత్వానికి, పోలీసులకు ఇటువంటి పరీక్షలు పెడుతుంటే, తమ కోసం జగన్ తవ్విన గోతిలో తానే ఎప్పుడు పడతాడా?అని కూటమి ప్రభుత్వం చాలా ఓపికగా ఎదురుచూస్తోంది. అదే.. జగన్, వైసీపీలకు అలుసుగా, బలహీనతగా కనిపిస్తోందేమో?




