సిఎం జగన్ లండన్ పర్యటన ముగించుకొని తాడేపల్లి చేరుకోగానే ఫస్ట్ వికెట్ పడింది. మేఘా ఇంజనీరింగ్ కంపెనీలో సలహాదారుగా చేస్తున్న పీవీ రమేష్ తన పదవికి రాజీనామా చేశారు.
ఆయన చంద్రబాబు నాయుడు హయాంలో ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేసి, పదవీ విరమణ చేసిన తర్వాత మేఘా ఇంజనీరింగ్ కంపెనీలో చేరారు. ఇంతవరకు బాగానే ఉంది.
అయితే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టును ఆయన ఖండించడం జగన్ ఆగ్రహానికి కారణమైంది. వెంటనే మేఘా ఇంజనీరింగ్ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డికి ఫోన్ వెళ్ళింది. ఆయన అభ్యర్ధన మేరకు పీవీ రమేష్ తన పదవికి రాజీనామా చేశారు.
ఇంతకీ పీవీ రమేష్ ఏమీ తప్పు మాట్లాడలేదు. ఒక్క ముక్క అదనంగా మాట్లాడలేదు. ఏపీ సీఐడి పోలీసులు ఈ కేసులో తాను అప్రూవరుగా మారిననట్లు సిఐడి చెప్పుకొంటోందని తెలిసి ఆశ్చర్యపోయి ఖండించానని పీవీ రమేష్ చెప్పారు.
దీనిపై మరింత వివరణ ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన రోజు సాయంత్రమే ఆయన మీడియా సమావేశం నిర్వహించాలనుకొంటే, ఒత్తిళ్ళ కారణంగా నిలిపివేసుకొన్నారు.
ఈలోగా ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. కానీ ఇప్పుడు ఆయన స్కిల్ డెవలప్‌మెంట్ పూర్వపరాల గురించి స్వేచ్ఛగా, మరింత లోతుగా వివరించగలిగారు. ఆర్ధికశాకాహ్ ముఖ్య కార్యదర్శిగా చేసిన ఆయన ఇదొక భూటకపు కేసు అని చెపుతున్నారు. దీని వలన నష్టపోయేది ఎవరు.. వైసీపి ప్రభుత్వమే కదా?
ఈ కేసు గురించి ఆయన చెప్పిన కొన్ని ముఖ్యమైన పాయింట్లు:
1. ఏపీ సీఐడీ అధికారులు నిధులు దుర్వినియోగం గురించి నన్ను ప్రశ్నించారు. ఏదైనా శాఖలో నిధులు కేటాయింపు, ఖర్చు, వాటి లెక్కలు ఏవిదంగా నిర్వహిస్తారో నేను వారికి వివరించాను.
2. స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ ఖాతాలో ఆర్ధికశాఖ నిధులు జమా చేసిన తర్వాత వాటికి ఆ సంస్థ ఎండీ, కార్యదర్శి జవాబుదారీ అవుతారు తప్ప ముఖ్యమంత్రి లేదా సీఎస్ లేదా మరొకరు కారు. కానీ సీఐడీ అధికారులు వారికి మినహాయింపు ఇచ్చారు. ఎందుకు?
3. ఒకవేళ నిధులు దుర్వినియోగం అయ్యాయని సీఐడీ భావిస్తే ముందుగా సదరు ‘ఒరిజినల్ ఫైల్’ని పరిశీలించి, దాని ఆధారంగానే దర్యాప్తు జరపాలి. కానీ ఒరిజినల్ ఫైల్ గురించి ప్రస్తావించకుండా అధికారులు తమ అవగాహన కొరకు వ్రాసుకొనే ‘షాడో ఫైల్స్’ గురించే ఈ కేసులో ప్రస్తావించారు. ఒరిజినల్ ఫైల్ గురించి ఎందుకు పేర్కొనడం లేదు?
4. ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమానికి నిధులు కేటాయించడం కోసం గత ప్రభుత్వం శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదించింది. కనుక ఇదేమీ రహస్యంగా జరిగిన గూడు పుఠాణీ ఏమీ కాదు.
5. నేను ఈ కేసులో నిందితుడిని కాను. ఒకవేళ అయ్యుంటే సీఐడీ అధికారులు ఎఫ్ఐఆర్ లేదా చార్జ్ షీట్‌లో పేర్కొనాలి. కానీ పేర్కొనకపోయినా నేను అప్రూవరుగా మారానని చెప్పుకొంటున్నారు. సీఐడీ అధికారులు నా స్టేట్‌మెంట్ మార్చి ఉండవచ్చని భావిస్తున్నాను. ఇదే నేను చెప్పాను.
ఒకసారి శాసనసభ బడ్జెట్ కేటాయింపులు ఆమోదించిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏ శాఖ వ్యవహారాలలో కలుగజేసుకొనేవారు కారు. కానీ ఇటువంటి కొన్ని కార్యక్రమాలు, పరిశ్రమలలో ఉద్యోగాలు, ఉపాధితో ముడిపడి ఉంటాయి కనుక పనులు వేగవంతం చేయమని పదేపదే చెపుతుండేవారు. అంతే!



