తెలంగాణ మంత్రులు జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉపకారమే చేస్తున్నారో లేక అపకారమే చేస్తున్నారో అనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే, ప్రస్తుతం జగన్ ప్రభుత్వాన్ని అనేక సమస్యలు చుట్టుముట్టి ఉన్నాయి. ఉద్యోగుల ఆందోళనలు చేస్తున్నారు. మరోపక్క నారా లోకేష్ యువగళం పాదయాత్రలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలను ఏకిపడేస్తున్నారు.
పార్టీలో నేతల కుమ్ములాటలు, టికెట్ల పంచాయితీలు, అసమ్మతి సెగలు, టిడిపి-జనసేనల పొత్తుల గురించి నిద్రలేని రాత్రులు, మరోపక్క సుప్రీంకోర్టు, హైకోర్టులో కేసులు, ముందుకు కదలనంటున్న మూడు రాజధానులు, నెలనెలా అప్పుల కోసం తిప్పలు… జీతాల కోసం ఉపాధ్యాయుల ఆందోళనలు… ఒకటా రెండా అనేక సమస్యలు. కానీ దేనినీ పరిష్కరించలేదు. అన్నిటినీ నానబెట్టుకొని కూర్చోక తప్పడం లేదు. కనుక ఇటువంటి క్లిష్ట సమయంలో తెలంగాణ మంత్రులు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే మహోపకారమే అవుతుంది. వారిపై ఎదురుదాడి చేస్తూ ప్రజల దృష్టిని ఈ సమస్యలపై నుంచి మళ్ళించవచ్చు.
అయితే తెలంగాణ మంత్రులతో గొడవ పెట్టుకోవడం అంటే కొరివితో తల గోక్కొవడమే అని తెలుసు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు నోరు విప్పితే వారిని తట్టుకోవడం చాలా కష్టం. అందుకే మంత్రి హరీష్ రావు “మీరు మా జోలికి రావద్దు మా నోళ్ళు తెరిపించొద్దని” చాలా స్పష్టంగానే హెచ్చరించారు.
కానీ పీత కష్టాలు పీతవన్నట్లు వైసీపీ కష్టాలు వైసీపీవి. ఇంట్లో ఈగల మోత భరించడం కంటే బయట మద్దెల మోత భరించడమే బెటర్ అనుకొన్నారో ఏమో, మంత్రి కార్మూరి నాగేశ్వర రావు, “హైదరాబాద్‌లో రోడ్లు బాగుంటే సరిపోతుందా?చిన్న వర్షం వస్తే హైదరాబాద్ అంతా మునిగిపోతుంది కదా? అయినా ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే కేసీఆర్ అప్పులలో ముంచేయలేదా?మేం చేస్తున్నట్లు సంక్షేమ పధకాలు అమలుచేయగలరా?మా స్కూళ్ళతో మీ స్కూళ్ళు పోటీ పడగలవా?మా రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరుగుతోందో తెలీకుండా నోరు జారొద్దు. ఓసారి వస్తే మేమే తిప్పి చూపిస్తాము” అంటూ విమర్శించారు.
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అప్పులతో అభివృద్ధి కనిపిస్తోంది. కానీ ఏపీ ప్రభుత్వం తెస్తున్న లక్షల కోట్ల అప్పులన్నీ ఏట్లో పిసికిన చింతపండులా కనబడకుండా పోతున్నాయి. తెలంగాణ మంత్రులు ఏపీలో రోడ్ల గురించి మాత్రమే నిలదీశారు. దానికే జవాబు చెప్పలేక సంక్షేమ పధకాల గురించి చెప్పుకోవడం ఎంత దయనీయం?ఒకవేళ వారు పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, పోలవరం ప్రాజెక్టు, అమరావతి, ఉద్యోగుల జీతాలు, బకాయిలు వంటి సమస్యల గురించి మాట్లాడితే వైసీపీ నేతలు సిగ్గుతో తలదించుకోవలసి వస్తుంది. కనుక అప్పుడప్పుడు సమస్యలపై నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి చిన్న చిన్న మాటల యుద్ధాలు చేసుకొన్నా పర్వాలేదు కానీ ఇలాంటి సీరియస్ విషయాల ప్రస్తావన రాకుండా వైసీపీ నేతలు జాగ్రత్తపడితే వారికే మంచిది.



