జగన్‌ను నమ్ముకొంటే ఎక్కడికి వెళతారంటే….

Minister-RK-Roja-Speech-At-Nagari-Jagananna-Vidya-Deevenaవారం వారం సంక్షేమ పధకాల కార్యక్రమంలో భాగంగా సిఎం జగన్‌ నేడు చిత్తూరు జిల్లాలోని మంత్రి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో బటన్ నొక్కి విద్యాదీవెన నిధులు విడుదలచేశారు. జగన్‌ భజనలో ఎప్పుడూ ముందుండే మంత్రి రోజా, ఆయన కళ్ళలో ఆనందం చూసేందుకు చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లని ఉద్దేశ్యించి వ్యంగ్యంగా మాట్లాడారు. ఆ తర్వాత జగన్‌ భజన కొనసాగిస్తూ, “జగన్‌ను ఎవరూ ఓడించలేరు. ఓడించాలంటే అవతలివాడు కూడా జగనే అయ్యుండాలి. సంక్షేమ పధకాలతో చాలా సంతోషంగా ఉన్న రాష్ట్ర ప్రజలందరూ ‘వన్స్ మోర్ జగన్‌’ అంటున్నారు. చంద్రబాబు నాయుడు ప్రాతినిద్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో కూడా ప్రతీ ఇంటికీ సంక్షేమ పధకాలు అందిస్తున్నారు.

చంద్రబాబు నాయుడుని నమ్ముకొంటే జైలుకి వెళతారు. అదే… పవన్‌ కళ్యాణ్‌ని నమ్ముకొంటే ఆయన నటిస్తున్న సినిమాలకు వెళతారు. అదే… జగన్‌ను నమ్ముకొంటే అందరూ కాలేజీలు, యూనివర్సిటీలకు వెళతారు,” అని మంత్రి రోజా అన్నారు.

ADVERTISEMENT

రోజా కాస్త అటూ ఇటూగా చెప్పినా వాటిలో కొంత వాస్తవలే చెప్పారు. వైసీపీకి బలం, బలహీనత రెండూ కూడా జగనే. ఆయన మొహం చూసే ప్రజలు వైసీపీకి ఓట్లు వేశారు. ఆయన పాలనతో వేసారిపోయున్న ప్రజలు ఈసారి వైసీపీని గద్దె దించవచ్చు. కనుక ‘వైసీపీ గెలిచినా, ఓడినా అది జగన్‌ వల్లే’ అని రోజా బాగానే చెప్పారు.

ఇక చంద్రబాబు నాయుడు తెచ్చిన ఉన్నత విద్యాసంస్థలలో చదువుకొని, ఐ‌టి కంపెనీలలో పనిచేస్తూ జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగినవారు వేలాదిమంది ఉన్నారు. నిరుడు హైదరాబాద్‌ ఐబీఎంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న పూర్వవిద్యార్ధులే ఈ విషయం స్వయంగా చెప్పుకొని చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. కనుక ఆయనకు మంత్రి రోజా సర్టిఫికేట్ అవసరం లేదు.

కానీ ఆమె చెప్పిన మాటలలో కొంత వాస్తవముంది. గత నాలుగున్నరేళ్ళుగా టిడిపి నేతలనీ, కార్యకర్తలని వైసీపీ ప్రభుత్వం ఎంతగా వేదిస్తోందో అందరూ చూస్తూనే ఉన్నారు. అయ్యనపాత్రుడు, అచ్చెన్నాయుడు, పట్టాభి వంటి సీనియర్ నేతలను ఏవిదంగా వేధించిందో అందరూ చూశారు. బహుశః అందుకే వారందరూ చంద్రబాబు నాయుడుని, టిడిపిని నమ్ముకొని జైలుపాలయ్యారని మంత్రి రోజా చెప్పిన్నట్లు భావించవచ్చు.

అక్రమాస్తుల కేసులలో ఎంత మంది ఐఏఎస్ అధికారులు, పారిశ్రామికవేత్తలు, మంత్రులు జైలుకి వెళ్లారో, ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో అందరికీ తెలుసు. ఆ కేసులోనే ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి ఇటీవల సుప్రీంకోర్టు నోటీసు పంపిన విషయం అందరికీ తెలిసిందే.

వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కోర్టు చుట్టూ తిరుగుతుండగా, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డితో సహా పలువురు ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్న సంగతి బహుశః మంత్రి రోజా మరిచిపోయారేమో? కనుక ఎవరిని నమ్ముకొంటే ఏమవుతుందో… ఎక్కడకు చేరుకొంటారో బహుశః బహుశః ఆమెకు కూడా తెలుసు. ఒకవేళ తెలియదనుకొంటే భవిష్యత్‌లో తప్పకుండా తెలుసుకొనే అవకాశం లభించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories